గిరిజన మహిళా రైతులపై ఫారెస్ట్ అధికారుల అనుచిత ప్రవర్తన
తమపైనే దాడిచేశారంటూ మహిళలపై కేసులు
అటవీభూములు ఆక్రమించి చెట్లను నరుకుతున్నారు :డీఎఫ్‌ఓ
మీడియాకు నో ఎంట్రీ జర్నలిస్టులు నిరసన
నవతెలంగాణ-దండేపల్లి
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ బీట్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. లింగాపూర్ బీట్‌లోని 360 కంపార్ట్‌మెంట్‌లోని ఫారెస్ట్ భూమిలో కొత్త మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని దమ్మన్నపేట గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారంటూ ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఫారెస్ట్ అధికారులు సుమారు 200 మందిపైగా సిబ్బంది కర్రలతో అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే, పోడు వ్యవసాయం చేస్తున్న ప్రాంతంలోని సమీపంలోని వాగులో శుక్రవారం కొందరు మహిళా గిరిజన రైతులు స్నానం చేస్తుండగా కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది వారితో అసభ్యంగా ప్రవర్తించి దాడులకు దిగారని బాధిత మహిళలు వాపోయారు. వారి నుంచి తప్పించుకునేందుకు, తమను రక్షించుకునేందుకు మహిళలు కొందరు ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని భయాందోళనను సృష్టించారు. మాన ప్రాణాలను కాపాడుకునేందుకే వారిని ప్రతిఘటించాలమని ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు తమతో అసభ్యంగా ప్రవరిస్తున్నారని, తమ గోడును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆవేదనను వినిపించుకోకుండా ఫారెస్ట్ సిబ్బంది 14 మంది మహిళలను పోలీసు బందోబస్తు మధ్య అరెస్టు చేసి దండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీడియా కవరేజ్ కోసం వచ్చిన ప్రతినిధులను లోపలికి అనుమతించలేదు. దాంతో ఫారెస్ట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టు ప్రతినిధులు అక్కడే రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. దమ్మన్నపేట గిరిజనులు ఆక్రమంగా ఫారెస్ట్ భూమిని ఆక్రమించి పోడు వ్యవసాయం పేరిట చెట్లను నరుకుతున్నారని తెలిపారు. ఆటవీ భూమిని ఆక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్టానికి లోబడే తమ విధులు నిర్వహిస్తున్నామని, అటవీ, వన్యప్రాణి చట్టాలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.