Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'మెటాఫండ్‌' మాయ

‘మెటాఫండ్‌’ మాయ

- Advertisement -

మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీష్‌ కేసులో రాజకీయ ప్రముఖుల పాత్రపై దర్యాప్తు?
ఒక్కొక్కటిగా వెలుగుజూస్తున్న మోసాల చిట్టా.. వసూళ్ల వ్యవహారం
ఇప్పటికే దుబారులో పెట్టుబడులు, విదేశాలకు నిధులు
రూ.100 కోట్లకుపైగా జనానికి కుచ్చుటోపీ పెట్టినట్టు అంచనా
బాధితులు ధైర్యంగా ముందుకురావాలని పోలీసుల విజ్ఞప్తి

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన మెటాఫండ్‌ కుంభకోణంలో మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీష్‌ అరెస్టు తర్వాత, ఈ వ్యవహారం వెనుక ఎవరైనా పెద్దలు, రాజకీయ నాయకులు ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్టు తెలిసింది. కేసులో ప్రధాన నిందితుడు లోకేష్‌ థారులాండ్‌కు పారిపోగా, సతీష్‌ దుబారు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో పట్టుబడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో (దాదాపు రూ.100 కోట్లు) మోసానికి పాల్పడటం, ఆ డబ్బును విదేశాలకు తరలించడం వంటివి ఒక్కరి వల్ల సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా ఫిర్యాదులొచ్చినా.. ఆర్నెళ్లుగా ఈ వ్యవహారంలో స్తబ్ధంగా ఉన్న పోలీసు శాఖ ఇప్పుడు కొరఢా ఝుళిపించడంతో కొంతమందిక దడ మొదలైంది. సీపీ గౌసం ఆలం ఈ ఆర్థిక నేరంపై ప్రత్యేక దృష్టిసారించిచడంతో చర్చనీయాశంగా మారింది.

పోలీసుల విచారణలో భాగంగా సతీష్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఐపాడ్‌, మొబైల్‌ ఫోన్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలను విశ్లేషిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా, ఈ కుంభకోణంలో ఆయన ఒక్కరే కాకుండా మరికొందరు ముఖ్యమైన వ్యక్తులు సూత్రధారులుగా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా, మోసానికి పాల్పడిన డబ్బును హవాలా మార్గంలో దుబారుకి తరలించడంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల సహాయం తీసుకున్నారా? అన్నది పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కట్ల సతీష్‌ అరెస్ట్‌తో పాటు, ఈ కేసులో మరో నలుగురు నిందితులు దాసరి రమేష్‌, దాసరి రాజు, బూర శ్రీధర్‌, తులసీ ప్రకాష్‌ను కూడా పోలీసులు రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు లోకేష్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు ఎలాంటి భయమూ లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రాజకీయపరమైన ఆరోపణలు
‘మెటాఫండ్‌’ కుంభకోణం గత ఏడాదిన్నరగా ఉమ్మడి జిల్లాలో తన అక్రమ దందాను కొనసాగిస్తున్నా, బాధితులు ఫిర్యాదు చేసినా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీష్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుని అనుచరుడిగా తిరిగారు. ఆయన ఒక్క పార్టీలోనే లేరు. కేంద్ర, రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆక్కడికి వాలిపోతుంటారని చర్చ ఉంది. సతీష్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న సమయంలోనే ఈ అక్రమాలు భారీ స్థాయిలో జరిగినట్టు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. సతీష్‌తోపాటు మరికొందరు నిందితులకు అధికార పార్టీ అండదండలు ఉండటం వల్లే, గత ప్రభుత్వం ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించలేదని వెలిచాల రాజేందర్‌ రావు లాంటి కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఇటీవల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరారు. కట్ల సతీష్‌ను పార్టీనుంచి తొలగించాలని ఇప్పటికే పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు ఆయన లేఖ సైతం రాశారు. అధిక లాభాలకు ఆశపడి మోసపోయిన బాధితుల్లో పోలీసు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఉన్నారని తెలిసింది. ఈ అంశం కూడా గత ప్రభత్వుంలో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి, కేసు దర్యాప్తును నీరుగార్చడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

మోసాల చిట్టా.. అందినకాడికి వసూళ్లు
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ అమాయకులను నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఈ కేసులో కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను రిమాండ్‌కు తరలించారు. తీగలగుట్టపల్లికి చెందిన భాస్కర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో తాను ‘మెటాఫండ్‌ క్రిప్టో’ అనే పథకంలో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని చెప్పి మాజీ కార్పొరేటర్‌ కట్ల సతీష్‌ నమ్మబలికాడని పేర్కొన్నారు. భాస్కర్‌ అతని మాటలు నమ్మి, గత సంవత్సరం జూన్‌లో రూ.15 లక్షలు ఇచ్చారు. అంతేకాకుండా, మరికొందరిని చేరిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సతీష్‌ చెప్పడంతో, భాస్కర్‌ తన పరిచయస్తులైన మరో 17 మందిని కూడా ఈ పథకంలో చేర్చారు. ఆ 17 మంది నుంచి మొత్తం రూ.1.20 కోట్లు సేకరించి సతీష్‌కు అందజేశారు. అయితే, హామీ ఇచ్చిన విధంగా మూడు నెలల్లో లాభాలు ఇవ్వకపోగా, ఇప్పుడు కనీసం అసలు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు.

దుబాయ్ లో పెట్టుబడులు, విదేశాలకు నిధులు
మెటాఫండ్‌ నిర్వాహకులు ఈ కుంభకోణంలో సేకరించిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దుబాయ్ లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, షేక్‌ జాహిద్‌ రోడ్‌లో ఒక పబ్‌ను ప్రారంభించారని సమాచారం. అంతేకాకుండా, బినామీల పేర్లతో అక్కడ అనేక వ్యాపారాలు చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలో పరిస్థితులు అనుకూలించకపోతే వీసా తీసుకుని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మరొక కీలక సూత్రధారి లోకేష్‌ ఇప్పటికే థాయిలాండ్‌కు పారిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -