Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమా కుటుంబాన్ని ఆదుకోండి

మా కుటుంబాన్ని ఆదుకోండి

- Advertisement -

జగ్గారెడ్డికి అంధబాలుడి విజ్ఞప్తి
తన తండ్రికి కిడ్నీలు పాడయ్యాయని కన్నీరు
రూ.7.50 లక్షల ఆర్థిక సాయం చేసిన మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
తన తండ్రికి కిడ్నీలు పాడైపోయాయని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని కన్నీరు పెట్టుకున్న అంధ బాలుడు వికాస్‌ నాయక్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం లోంకా తాండాకు చెందిన వికాస్‌ నాయక్‌ నిజామాబాద్‌ పట్టణంలోని స్నేహ సొసైటీకి చెందిన అంధుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతను మూడేండ్ల్ల వయస్సులో అనారోగ్యంతో చూపును కోల్పోయాడు. వికాస్‌ అద్భుతంగా పాటలు పాడతాడు. కోమరెల్లి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత, హనుమంతుడు వంటి పౌరాణిక గాథలను, కథలు కూడా చెబుతాడు. పాటల రూపంలో ఆ కథలను వినిపించడంలో మంచి ప్రావీణ్యం పొందాడు. టీవీలో వచ్చే కార్టూన్‌ క్యారెక్టర్‌ల డైలాగ్స్‌ను అచ్చు గుద్దినట్టు అనుకరించి చెప్పగలడు. ఇదిలా ఉండగా వికాస్‌ అమ్మ కవిత, తాత, అమ్మమ్మ, పెద్దమ్మలను వెంటబెట్టుకుని జగ్గారెడ్డిని కలవడానికి సంగారెడ్డి వచ్చాడు. ఈ విద్యార్థి అద్భుతమైన గొంతుతో పాటలు పాడుతుంటే విని జగ్గారెడ్డి మురిసిపోయారు.

పౌరాణిక గాథలు, కథలు చెబుతుంటే ఆసక్తిగా విని శభాష్‌ అని అభినందించారు. తన తండ్రికి రెండు కిడ్నీలు పాడై రెండేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, తన కోసం, తన తండ్రి చికిత్స కోసం రూ.6 లక్షల అప్పు అయిందని దానికి వడ్డీ మరో లక్ష వరకు అయిందని కన్నీరు పెట్టుకున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. తాను స్వయంగా యూట్యూబ్‌ పెట్టుకుంటానని, సహకరించాలని కోరాడు. కష్టపడి బాగా చదువుకొని కలెక్టర్‌ అవుతానని జగ్గారెడ్డికి చెప్పుకొచ్చాడు. బాలుని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చూసి చలించిన జగ్గారెడ్డి.. రూ.7.50 లక్షలు సాయం అందించి మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని జగ్గారెడ్డి ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వికాస్‌తో పాటలు పాడించేందుకు పిలిపిస్తానని జగ్గారెడ్డి వికాస్‌ తల్లికి చెప్పారు. అంతేకాకుండా స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్‌ నాయక్‌ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపించారు. జగ్గారెడ్డి సహకారానికి వికాస్‌ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -