గ్రామ పాలనాధికారులకు నియామక పత్రాలు
విధుల్లో 5000 మంది జీపీవోలు
రెవెన్యూ సమస్యలు గాడినపడతాయని ప్రజల ఆశాభావం
ఖమ్మం జిల్లాలో 252 మంది రిక్రూట్‌మెంట్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ జిల్లాల్లో నియామక పత్రాలు అందుకున్న జీపీవోలు విధుల్లో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మందిని రిక్రూట్‌మెంట్ చేశారు. వీరు విధుల్లో చేరితే రెవెన్యూ సమస్యలు కొంతమేర గాడిలో పడతాయనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. ఇకపై భూ రికార్డుల నిర్వహణలో వీరే కీలకం కానున్నారు. 2020 సెప్టెంబర్‌లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. వీఆర్వోల స్థానంలో జీపీవోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హౌదాను కల్పించి, గ్రామస్థాయి రెవెన్యూ సేవలను పునరుద్ధరిం చింది. వీఆర్వోల్లో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ఈ నెల 5న జీపీవో నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. సదరు జీపీవోలను ఆయా జిల్లాలకు అలాట్‌మెంట్ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యి.. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు 15 రోజుల్లోపు విధుల్లో చేరతారు.
గ్రామ పాలనలో కీలకం
గ్రామాల్లో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి, అంగ న్వాడీ, వైద్య, విద్య.. ఇలా దాదాపు 16 రకాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి, భూముల హద్దుల గుర్తింపునకు గతంలో సేవలందించిన వీఆర్వో, వీఆర్‌ఎలను తొలగించారు. వారి స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలనాధికారి వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీపీవో పోస్టుల భర్తీకి గతంలో రెవెన్యూశాఖలో వీఆర్వోలు, వీఆర్‌ఏ లుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖా స్తులు ఆహ్వానించి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిం చింది. ఉత్తీర్ణులైన వారిని పోస్టులకు ఎంపిక చేసింది.
సొంత మండలం కాకుండా..
ఖమ్మం జిల్లాలో 299 క్లస్టర్లలో గ్రామ పరిపాలనా అధికారుల నియామకానికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పరీక్ష ద్వారా 252 మందిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశారు. వీరిలో 240 మంది లోకల్, 12 మంది నాన్ లోకల్ ఉన్నారు. గ్రామపాలనా అధికారులకు అవసరమైన శిక్షణ కూడా అందించారు. సొంత మండలం మినహాయించి, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగులు ఇచ్చారు. ప్రజావాణి, గ్రామాల సందర్శన సందర్భంగా జిల్లా అధికారులకు ఎక్కువగా భూ సమస్యల దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం జీపీవోలపై పెట్టింది. గ్రామీణ స్థాయిలో భూ భారతి చట్టం పటిష్ట అమలు కూడా వీరి చేతిలోనే ఉంది. జీపీవోలకు సర్వీస్ రూల్స్ నోటిఫై చేసి, ప్రమోషన్లు, ఇతరత్ర బెనిఫిట్స్‌ను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జీపీవోల విధివిధానాలు..
ప్రభుత్వ, ప్రయివేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ జీపీవోలు పర్యవేక్షిస్తారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఈ పోస్టులను ప్రభుత్వం కొత్తగా తీసుకురాగా 11 రకాల జాబ్‌చార్టును అనుసరించనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా భవిష్యత్‌లో ప్రతి రిజిస్ట్రేషన్-మ్యూటేషన్‌కు మ్యాప్ జోడించడంలో వీరు సహాయకారిగా పని చేస్తారు. గ్రామ స్థాయిలో భూ ఖాతా (విలేజ్ ఎకౌంట్) నిర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృ దస్త్రం నిర్వహిస్తారు. అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పులు చేర్పులు చేస్తారు. లావోణి, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటివనరుల కింద భూములను పరిరక్షిస్తారు. భూమి ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పులు నమోదు చేస్తారు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందిస్తారు. ప్రకృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా వేస్తారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ చేస్తారు. జనన, మరణ విచారణలు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తారు.
రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికే జీపీవోల నియామకం
పైరవీలకు, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మెరిట్ పద్దతిలో గ్రామ పాలన అధికారులకు కౌన్సెలింగ్ చేపట్టి, పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేశాం. రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించింది. క్రమశిక్షణాయుతంగా విధులు నిర్వహించి, ప్రతిభ చూపిన వారికి ప్రోత్సాహకాలు ఉంటాయి.
అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం జిల్లా కలెక్టర్