• లాభదాయకమైనా ఆసక్తి చూపని రైతులు
• రసాయన ఎరువులతో నష్టాలే ఎక్కువ
• అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు
నవతెలంగాణ -పెద్దవంగర
పంటలు సాగు చేసి మూడు నెలలు గడుస్తున్నా నేటికీ రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. క్షేత్రస్థాయిలో యూరియా కు బదులుగా నానో యూరియా వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఐనా రైతులు నానో యూరియాపై ఆసక్తి చూపడం లేదు. నానో యూరియా వాడకం వల్ల పంటల ఎదుగుదల లోపిస్తుందని, రైతులకు ఉన్న అపోహల్లో నిజం లేదని, నానో యూరియాతోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మండలంలోని పోచంపల్లి, పెద్దవంగర, చిన్నవంగర రైతు సేవా కేంద్రాల్లో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా మండలానికి సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో అన్నదాతలు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు.
• 18,778 వేల ఎకరాల్లో సాగు..
మండలంలో రైతులు 13005 ఎకరాల్లో వరి, 5256 ఎకరాల్లో పత్తి, 371 ఎకరాల్లో మొక్కజొన్న, 44 ఎకరాల్లో కంది, 52 ఎకరాల్లో పెసర, 50 ఎకరాల్లో ఇతర పంటలు మొత్తం 18,778 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. దీనికి గాను సుమారు 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 985 మెట్రిక్ టన్నుల యూరియా అధికారులు పంపిణీ చేశారు. పంటలు కోత దశకు వచ్చినా కూడా 50 శాతం యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
• నానో తో ఎన్నో లాభాలు..
నానో యూరియా మొక్కలకు పోషకాలు సమర్థంగా అందిస్తుంది. అధిక దిగుబడికి దారి తీస్తుంది. పంటల్లో పోషక లోపాలను సరి చేస్తుంది. మెరుగైన ఆహార నాణ్యతకు దోహదం చేస్తుంది. రసాయన ఎరువుల వినియోగ అవసరాన్ని తగ్గిస్తుంది. తక్కువ కార్బన్ విడుదలతో పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. అధిక రసాయన ఎరువుల వల్ల దెబ్బతినే నేల, గాలి, నీటి కాలుష్యాన్నీ తగ్గిస్తుందని చెబుతున్నారు. పంట పోషకాల సామర్ధ్యాన్ని పెంచి, మొక్కల ఎదుగుదలకు దోహదపడుతుంది. మట్టిపై రసాయన భారాన్ని తగ్గించి, వృధా కాకుండా ఉంటుంది.
నానో ఎరువులు నిల్వ చేసుకోవడం, రవాణా చేయడం చాలా సులభం. నీరు, మట్టిలో కలుషితాన్ని తగ్గించి, పంట దిగుబడుల్లో మెరుగుదల కల్పిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. బస్తా యూరియా సబ్సిడీ పోను గరిష్ఠ చిల్లర ధర రూ.266.50. అర లీటర్ నానో యూరియా ధర రూ.225. ఇది 45 కిలోల యూరియా బస్తాకు సమానం. 2-4 మిల్లీమీటర్ల నానో యూరియాను లీటర్ నీటిలో కలిపి ఎకరానికి రెండుసార్లు పిచికారి చేయొచ్చు. రసాయన యూరియాలో 30-40 శాతం పోషకాలు ఉంటే నానో యూరియాలో 80-90 శాతం ఉంటాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
• యూరియా అందక ఇబ్బందులు
సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నాం. నాలుగు ఎకరాల్లో వరి పంట, ఎకరం పత్తి సాగు చేస్తున్నాను. యూరియా కోసం భార్యాభర్తం ఇద్దరం వస్తున్నాం. అధికారులు ఎకరాని ఒకే బస్తా ఇస్తున్నారు. దీంతో పంటలకు సరైన మోతాదులో యూరియా వేయలేకపోతున్నాం – సాకి కరుణాకర్ (కొరిపల్లి)
• నానో యూరియా వాడాలి.
రైతులు యూరియా బదులుగా నానో యూరియాను పంటలపై స్ప్రే చేయాలి. ఒక బస్తా యూరియా రూ.266గా ఉంది. నానో యూరియా 250 మి.లీ. రూ.150 నుండి రూ. 200 లకు దొరుకుతుంది. నానో యూరియా పైన అవగాహన కల్పిస్తున్నాం. రైతులు పంటల పైన నానో యూరియాను పిచికారీ చేసుకుని, అధిక దిగుబడి పొందాలి -గుగులోత్ స్వామి నాయక్ (ఏవో-పెద్దవంగర)