Sunday, September 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలువెట్టి నుంచి విముక్తి కోసమే సాయుధ పోరాటం: సీపీఐ(ఎం)

వెట్టి నుంచి విముక్తి కోసమే సాయుధ పోరాటం: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి  

భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  “వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వాస్తవాలు – వక్రీకరణలు” అనే అంశంపై సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏ రమేష్ అధ్యక్షతన ఆదివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ.. సాయిధ పోరాటాన్ని మతోన్మాద బిజెపి, ఆర్ఎస్ఎస్ లు వక్రీకరిస్తూ హిందూ- ముస్లిం వివాదంగా ప్రచారం చేయటం సరైనది కాదని ఆయన హెచ్చరించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేక విజయాలు సాధించిందన్నారు. కానీ నేడు బిజెపి ఆర్ఎస్ఎస్ లు పోరాట వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి. అలా చేస్తే తిరుగుబాటు తప్పదని అన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక విజయాలు సాధించిందన్నారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించిందన్నారు. పది లక్షల ఎకరాల భూములు పంచారన్నారు. కూలి పెంచారని, వెట్టి చాకిరి విముక్తి చేశారని తెలిపారు. వడ్డీ అప్పులు రద్దు చేశారన్నారు. ఎందరో మహానుభావులు అసమాన ధైర్య సాహసాలు త్యాగాలు చేశారన్నారు. ఈ ప్రాంత ప్రజలు నేడు కొంతైనా మెరుగైన జీవితం గడుపుతున్నారంటే నాటి ఆ పోరాటమే కారణమని అన్నారు. నిజాం కు జామిందార్లు, జాగిర్దారులు, దేశ్ముకులు, పటేళ్లు, పట్వారీలు ఊడిగం చేశారన్నారు. వీరి దౌర్జన్యాలు పరాకాష్టకు చేరడం వల్లే తెలంగాణ సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. ప్రస్తుతం వీరంతా లేకున్నా చిన్నస్థాయి జమీందారులు మాత్రం ఉన్నారని తెలంగాణ ప్రాంతం అభివృద్ధి వెనుక నాలుగువేల మంది సాయుధ పోరాట అమరవీరుల రక్తంతో తడిసిన త్యాగాలు ఉన్నాయన్నారు.

నాటి నిజాం నేటి ఆర్ఎస్ఎస్, బిజెపి ఫాసిస్టు విధానాలు ఒక్కటేనని వివరించారు. అప్పట్లో కమ్యూనిస్టులు ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా గ్రామాల్లో రాత్రిపూట వయోజన పాఠశాల నడిపారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపి ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ ముస్లిం వివాదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో బిజెపి ఆర్ఎస్ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని అన్నారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ .లక్ష్మి, సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కార్యదర్శి ఎం .పరమేశ్వర చారి ప్రసంగిస్తూ చాకలి ఐలమ్మ పోరాటం నేడు అందరికీ ఆదర్శమన్నారు. నాడు ఐలమ్మ భూ పోరాటం అనేక గుణపాఠాలను నేర్పిందని, ధైర్య సాహసాలతో వీరోచిత ఉద్యమానికి ఒక గుర్తుగా మిగిలిందన్నారు. నేడు ఆర్ఎస్ఎస్, బిజెపి హిందూ- ముస్లిం కొట్లాటగా ప్రచారం చేయడం తగదన్నారు. ఆనాడు పోరాటంలో లేనివారు, హిందూ భూస్వాములకు అనుకూలంగా ఉన్నవారు, నేడు హిందూ, ముస్లిం ఘర్షణగా చూపడం తగదన్నారు. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని, నేటి విద్యార్థి యువత ముఖ్యంగా చరిత్రను తెలుసుకొని మసలుకోవాలని సూచించారు. ఈ సెమినార్ లో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ సభ్యులు ఎం. ఆంజనేయులు ,పట్టణ కమిటీ సభ్యులు జి. మదన్, బిసన్న, ఎం. మన్యం ,డి. శ్రీనివాసులు, రత్నయ్య ,సుగుణమ్మ, రాములు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -