Monday, September 15, 2025
E-PAPER
Homeదర్వాజCARDIOMEGALY అనే హృదయ వైశాల్యం!

CARDIOMEGALY అనే హృదయ వైశాల్యం!

- Advertisement -
  1. ‘అతని హృదయం ఎంతో విశాలం!’
    సభల్లో ఈ మాటలు విన్నప్పుడల్లా ఛాతి ఉప్పొంగేది..
    అందరినీ ఆదరించగలిగే గుండె ఉన్నందుకు సంతోషం అనిపించేది..
    గుప్పెడంత గుండె కాస్తా పుష్పకవిమానం అయినందుకు ఆనందమేసేది..!
  2. ‘అతని గుండెకు తడి దనం తెలుసు!’
    మాటల్లో మాటగా ఎవరైనా అలా అంటే
    మనలో కారుణ్యం పొంగి పోతుందని సంబరమయ్యేది..
    కష్టాల్లో ఉన్న సాటి మనుషుల దుఃఖాన్ని
    సహానుభూతి చెందగల తత్వం ఉన్నందుకు
    జన్మ సార్థకం అనిపించేది..
    నాలుగు గదుల గుండెలో
    దయా సాగరం తొణికిసలాడుతూ ఉన్నదని
    గర్వంగా అనిపించేది..!
  3. ‘జీవితంలో సమస్యలు- సవాళ్ళు సహజం!
    అతను వాటిని ఎదురొడ్డి నిలబడ్డాడు
    గుండె ను గట్టిగా దిటవు చేసుకుని గుండె చుట్టూ కవచాన్ని నిర్మించాడు’ అని
    Personality Development
    ప్రసంగం చెప్పినప్పుడల్లా,
    YES..! మన గుండె ‘గండరగండ’ అయినందుకు
    గర్వంగా అనిపించేది…
  4. నిజమే కదా!
    ప్రపంచంలోని విషాదాన్ని అర్థం చేసుకోవాలంటే
    మన గుండె కూడా అంతగా ‘విస్తరించాలి’!
    లోకంలోని బాధలన్నింటికీ పరిష్కారం వెదకాలంటే
    మన గుండె కూడా
    ‘చెమ్మ’తో నిండిపోవాలి!
  5. పుస్తకాలు, తత్వాలు, దార్శనికతలు, ప్రసంగాలు అన్నీ
    మనిషిలో ఇరుకుదనం – సంకుచితత్వాన్ని అధిగమించి
    వ్యాకోచించాల్సిన గుండె విస్తరణ గురించి,
    ‘గండశిల’గా కఠినంగా మారకుండా
    గుండె నిండా ఆర్ద్రతను నింపుకోవాల్సిన
    ఆవశ్యకత గురించి
    వివరించి, విడమరిచి, విశదీకరించారు కదా!
    అప్పుడు మాత్రమే
    సంపూర్ణ మానవత్వం – సమగ్ర మూర్తిమత్వం సాధ్యమని
    రీల్స్‌ రీల్స్‌ గా చెబుతూనే ఉన్నాయి కదా!
    6.ఇప్పటిదాకా…
    ఇదంతా మహౌన్నతమనీ, ఉదాత్త జీవన విలువ అనీ భ్రమించాను
    ఇప్పుడే తెలిసింది…HRCT Scan report వచ్చాక…
    గుండె విస్తరణ అంటే CARDIOMEGALY అనీ,
    గుండె దిటవు అంటే PERICARDITIS అనీ,
    గుండె చెమ్మగిల్లడం అంటే
    PERICARDIAL EFFUSION
    అనీ అర్థమైంది!
    7.భాషాపండితులారా! తత్వవేత్తలారా!
    మీ వాక్‌ శుద్ధి చాలా శక్తివంతమైనది
    మీరు దీవించి దీవించి
    గుండెను కొండంత కావాలంటారు
    ఆశించి ఆశించి
    గుండెను అభిషేకం చేయాలంటారు
    ఇంకేం? మీ భాషణను నిజం చేయడానికి ”తథాస్తు దేవతలు” కాచుకొని చూస్తుంటారు..
    అప్పుడు ఆ పిడికెడు గుండెకు ఏమవుతుందో
    ఒక్కసారి Physioligist నీ, Cardiologist నీ అడగండి…
    8.ఇక ముందెప్పుడూ గుండె మీద మీ వ్యాఖ్యానాలను
    రుద్దకండి!
    మీ పాండితీ ప్రకర్షతో, అభిమాన ఉత్కర్షతో
    గుండెను ఉపమానాలతో ముంచేయకండి!!
    9.గుండెను గుండె గానే చూడండి!
    గుండెను గుండె స్థానంలోనే ఉంచండి!!
    గుండెను గుండె పని చేసుకోనివ్వండి!!!
  • డాక్టర్‌ మామిడి హరికృష్ణ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -