Monday, September 15, 2025
E-PAPER
Homeదర్వాజహరిభట్టు - వేమన పద్యపాఠం

హరిభట్టు – వేమన పద్యపాఠం

- Advertisement -

తెలంగాణకు చెందిన ఉత్తమ కవులలో హరిభట్టు ఒకరు. మత్స్యపురాణము, వరాహపురాణము, నారసింహ పురాణము- ఉత్తరభాగము హరిభట్టు రచనలు. కవిత్వం ధారాశుద్ధి కలిగి తెలుగు సంప్రదాయ సాహిత్యంలో తొలి తరం కవులయిన నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, పోతనల కవిత్వంతో పోల్చదగినదిగా అనిపించినప్పటికీ, ఏ కారణం చేతనో రావలసినంత పేరు హరిభట్టు రచనలకు రాలేదన్నది తెలుగులోని పూర్వసాహిత్యంతో పరిచయం ఉన్న వ్యక్తులు భావిస్తారు.

శ్రీలక్ష్మీనసింహపురాణం పేరుతో, శ్రీహరి అవతారాలలో ఒకటైన నరసింహావతార కథను ఎఱ్ఱాప్రగడ తెలుగులో రచించాడు. అందులో నరసింహావతారం కథ హిరణ్యకశిపుడి మరణంతో ముగుస్తుంది. అయితే ఆ తరువాత ప్రహ్లాదుడు ఏం చేసాడు? తండ్రి వదిలి వెళ్ళిన రాజ్యానికి ప్రహ్లాదుడు అధిపతి కదా! తండ్రి మరణం తరువాత అసురులందరూ ప్రహ్లాదుడి వలెనే శ్రీహరిని కీర్తిస్తూ కాలం గడిపారా? అలా కాకపోతే మరేం చేశారు? అనే అంశాలతో ‘నసింహ పురాణానికి’ తరువాయి భాగంగా ‘నారసింహపురాణము-ఉత్తరభాగం’ అనే పేరుతో హరిభట్టు కావ్యం రచించాడు. ఆ కావ్యాన్ని ‘ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక-కాకినాడ’ వారు 1920లలో ప్రచురించారు. అందులోని చతుర్థాశ్వాసంలో ఒక పద్యం ఈ క్రిందిది.

కం. భల్లూకచర్మ ముదికినఁ
దెల్లనగునె? దుష్టకష్ట దితికులజుడ వీ
వుల్లంఘించుచు సమనో
వాల్లభ్యము నొందఁగలవె వక్రవిచారా.
సర్గలోకాధిపతియైన ఇంద్రుడిపైకి దండెత్తివెళ్ళిన ప్రహ్లాదుడితో ఇంద్రుడు మాట్లాడే మాటలలోని కొన్ని మాటలు ఈ పద్యం. ‘మంత్రుల మాటలు విని ఇలా దేవతలపైకి దండెత్తి రావడం నీకు తగని పని, నీ దారి మార్చుకో’ అని మంచి మాటలతో మనసు మళ్ళించే ప్రయత్నం అప్పటికే చేశాడు ఇంద్రుడు. ఆ మాటలకు, ‘ఎన్నాళ్ళని నీవే స్వర్గలోకాధిపత్యాన్ని వహించి విర్రవీగుతావు? కొన్నాళ్ళు నాకు ఆధిపత్యాన్ని ఇచ్చేసి నువ్వు పక్కన కూర్చో!’ అన్నాడు ప్రహ్లాదుడు. పైపెచ్చు ‘శ్రీమహావిష్ణువు సంగతి నాకు తెలుసు, ఆయన నా మాట కాదనడు!’ అని కూడా ఆ సందర్భంగా అన్నాడు. అటువంటి సమాధానం ప్రహ్లాదుడి నుండి విన్న ఇంద్రుడు ‘ఎలుగు తోలు’ ఉదాహరణను మనసులోకి తెచ్చుకుని, ప్రహ్లాదుడి మానసిక స్థితిని ఎలుగుతోలుతో పోల్చి, దాన్ని ఉతికి తెలుపు చేయాలని అనుకోవడం మూర?త్వమే అవుతుంది అని తలపోయడం పై పద్యంలో భావం.

ఈ పద్యం వేమన శతకంలోని ‘ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా’ అనే పసిద్ధమైన పద్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ వేమన పద్యంలోని ‘ఎలుక’ నిజానికి ఎలుక కాదు, ఎలుగు (యెలుగుబంటి) అనే విషయం చెన్నై నగరంలోని ‘ప్రభుత్వ ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారం’ లో భద్రం చేయబడి ఉన్న ఒక తాళపత్ర ప్రతిలోని పాఠం వలన తెలుస్తుంది. వేమన పద్యాలపై విశేషమైన కషి చేసి, వేమన పద్యాలకు సాహిత్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన సి.పి. బ్రౌన్‌ working copies లోను notes లోను కూడా వేమన శతకంలోని ఈ పద్యం ‘ఎలుగుతోలు’ అనే మాటతోనే మొదలవుతుంది. ఈ పద్యానికి సి.పి. బ్రౌన్‌ చేసిన ఆంగ్లానువాదం కూడా If thou take a bear skin అనే మాటలతో మొదలౌతుంది. సి.పి. బ్రౌన్‌ వేమన పద్యాలపై కషి చేసినది, ఆ తరువాత వేమన పద్యాలను అనువాదం చేసి మూడు వాల్యూములుగా ప్రచురించినది 1830-40 దశకంలో. అప్పటి వరకు ఈ పద్యం ‘ఎలుగుతోలు’ అనే సరైన పాఠంతోనే మొదలయిందని ఇది చెబుతుంది. ఆ తరువాతి కాలంలో ఎవరో ఒక అనామక లేఖకుని అశ్రద్ధ వలనలో లేక మరే కారణం చేతనో ‘ఎలుకతోలు’ గా రూపాంతరం చెంది, ఈ నాటికీ వేమన పద్యాల అచ్చు ప్రతులలోను, పాఠ్య పుస్తకాలలోను ‘ఎలుకతోలు’ అనే అపపాఠంతోనే కొనసాగుతూ ఉంది. ఈ పాఠం సరైనది కాదని, సవరణ అవసరమని చెప్పడానికి మరొక ఉత్తమమైన నిదర్శనంగా హరిభట్టు రచించిన ‘నారసింహ పురాణము-ఉత్తరభాగం’ లోని పై పద్యం నిలిచి ఉంది.

  • భట్టు వెంకటరావు, 9959120528
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -