నుపుర్‌కు రజతం, పూజకు కాంస్యం
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ 2025
లివర్‌పూల్ (ఇంగ్లాండ్) : వరల్డ్ బాక్సింగ్ (డబ్ల్యూ) ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్ రెండు బంగారు పతకాలు సహా నాలుగు మెడల్స్ సాధించింది. 20 మంది బాక్సర్లతో వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడిన భారత్.. నాలుగు పతకాలు మహిళల విభాగంలోనే సాధించటం విశేషం. మహిళల 48 కేజీల విభాగంలో మీనాక్షి, మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లంబోరియలు పసిడి పంచ్ విసిరారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో తొలుత జైస్మిన్ బంగారు పతకంతో మెరిసింది. 2024 పారిస్ ఒలింపిక్స్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన జైస్మిన్.. తాజాగా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌ను ఓడించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మూడు రౌండ్లలో తొలుత జైస్మిన్ వెనుకంజ వేసింది. తొలి రౌండ్లో ఐదుగురు న్యాయమూర్తులు 3-2తో పొలాండ్ బాక్సర్, పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జూలియ వైపు మొగ్గుచూపారు. డిఫెన్స్‌ను పక్కనపెట్టిన జైస్మిన్.. తర్వాతి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసింది. ఫలితంగా ఐదుగురు న్యాయనిర్ణేతలు 4-1తో జైస్మిన్‌ను విజేతగా ఎంచుకున్నారు. మహిళల 48 కేజీల విభాగంలో కజకిస్తాన్ బాక్సర్ నజీమ్ రెండో రౌండ్లో 3-2తో మీనాక్షిపై పైచేయి సాధించినా.. తొలి, మూడో రౌండ్లో మీనాక్షి 4-1తో ఆధిపత్యం చెలాయించింది. 4-1తో పసిడి పోరులో నెగ్గిన మీనాక్షి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.
మహిళల విభాగంలో 80 కేజీల విభాగం సెమీఫైనల్లో పూజ రాణి పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ బాక్సర్ చేతిలో 1-4తో ఓటమి పాలైంది. దీంతో పూజ రాణి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 80ం కేజీల విభాగం ఫైనల్ హౌరాహౌరీగా సాగింది. తొలి రౌండ్లో 2-3, రెండో రౌండ్లో 2-3, మూడో రౌండ్లోనూ 2-3తో నుపుర్ గట్టి పోటీ ఇచ్చింది. ఐదుగురు న్యాయ నిర్ణేతల్లో ఇద్దరు నుపుర్‌కు, ముగ్గురు పొలాంబ్ బాక్సర్ అజట వైపు మొగ్గు చూపారు. దీంతో నుపుర్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.