– ఉధృతంగా ప్రవహిస్తున్న నందివాగు
– ఎవుసం చేయాలంటే వాగు దాటాల్సిందే
– సదాశివపేట మండలం కంబాలపల్లిలో రైతుల పాట్లు
– వాగుదాటేందుకు థర్మకోల్ షీట్ ఏర్పాటు చేసుకున్న రైతులు
– వాగుకు ఆవల 150 ఎకరాల భూములు
– శాశ్వతంగా బ్రిడ్జి నిర్మించాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రైతులు తమ పంటపొలాల్లో సాగు చేయాలంటే సాహాసం చేయాల్సిందే. తమ పొలాల్లోకి వెళ్లేందుకు వాగు దాటాల్సిందే. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగుకు వరద ఉధృతి పెరగడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటుతున్నారు. లేదంటే రైతులు. సాగుకు దూరం కావాల్సిందే. ఇదంతా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని రైతుల పరిస్థితి. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం కేంద్రంలోని నందివాగు ప్రాజెక్టు నుంచి కంబాలపల్లి గ్రామ పరిధి నుంచి నందివాగు ప్రవహిస్తుంది. భారీ వర్షాలతో వరద ఉధృతి పెరగడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇలా ప్రతి ఏడాది జూన్, జులై నుంచి డిసెంబర్ వరకు వాగు ప్రవహిస్తుంటుంది. ఈ సమయంలో పీకల్లోతు నీరు ప్రవహిస్తుండటంతో రైతులు అష్టకష్టాలు పడుతూ వాగు దాటుతుంటుంటారు. ఈ వాగుపై బ్రిడ్జి కట్టించాలని ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో వాగును దాటేందుకు రైతులు ప్రత్యామ్నాయంగా థర్మాకోల్ షీట్‌తో తెప్పను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెప్ప ద్వారా గ్రామంలోని నంది వాగును దాటి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మరీ వ్యవసాయం చేస్తున్నారు.కంబాలపల్లి గ్రామంలోని 100 మంది రైతులకు సంబంధించిన 150 ఎకరాల వరకు భూములు నందివాగు ఆవల ఉన్నాయి. ఆ భూముల్లోకి వెళ్లి సాగు చేసి పంటలు పండించాలంటే తప్పనిసరిగా వాగు దాటాల్సిందే. లేదంటే సాగుకు దూరం కావలసిందే. నందివాగు ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు దాటితే ప్రాణాలపై ఆశవదు లుకోవాల్సిందే. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలంటే గ్రామం నుంచి మరో 15 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో దూరభారం అవుతుంది. దాంతో వాగు దాటకతప్పని పరిస్థితి. కంబాలపల్లి రైతులు కూడా తమ పంట పొలాలను సాగు చేసుకునేందుకు నందివాగు దాటి వెళ్తున్నారు. ముఖ్యంగా జూన్, జులై నెలల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తాయని రైతులు తెలుపుతున్నారు.
వర్షాల అనంతరం తాత్కాలిక వాగు నిర్మాణం
నందివాగు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే వాగు వాటి మరీ పంటలు పండిస్తారు. వర్షాకాలం గడిచిన తర్వాత పెద్ద పెద్ద పైపులను వాగులో వేసి తాత్కాలిక బ్రిడ్జీ నిర్మించుకుంటారు. ఆ బ్రిడ్జీ ద్వారానే వాగును దాటి తాము పండించిన పంటలను తీసుకువస్తారు. కానీ వర్షాకాలంలో వచ్చే వరదలతో ఈ తాత్కాలిక వంతెన కొట్టుకుపోతుంది. దాంతో ఈ సమయంలో వాగు దాటేందుకు గ్రామ రైతులు థర్మకోల్ షీట్లతో తెప్పను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెప్ప ద్వారా నదిని దాటేందుకు వాగు ఆవల ఉన్న చెట్లకు పెద్ద పెద్ద తాళ్లను కట్టి రైతులు తెప్పపై కూర్చుని తాడును లాగుతూ అవతలి గట్టుకు, ఈవలిగట్టుకు చేరుకుంటారు. పశువులకు వేయాల్సిన మేతను సైతం రైతులు తమ తలపై పెట్టుకుని తెప్ప ద్వారా గ్రామానికి చేరుకుంటారు. ఇలాంటి కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు నందివాగుపై శాశ్వ్వతంగా బ్రిడ్జీ నిర్మించాలని రైతులు వేడుకుంటున్నారు.
పంట పండించాలంటే వాగు దాటాలి : ఇందూరి బాబు, రైతు
వాగుకు ఆవల ఒక ఎకరం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. అందులో చెరుకు పంట సాగు చేస్తున్నాను. మా గ్రామం నుంచి ప్రవహించే నందివాగు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు నదిలో పైపులు వేసి దారి ఏర్పాటు చేసుకుంటాం. కానీ భారీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రభుత్వం మా కష్టాలు తీర్చి దారి ఏర్పాటు చేయాలి.
వాగుదాటాలంటే తెప్ప నుంచి వేళ్లాల్సిందే
నందివాగు ఆవల రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో పత్తి, కూరగాయలు సాగు చేస్తున్నాను. వర్షం వచ్చిందంటే వాగు ఉధృతంగా పారుతుంది. చాలా సంవత్సరాల నుంచి మాకు ఇదే బాధ ఉంది. వాగు దాటాలంటే తాము ఏర్పాటు చేసుకున్న థర్మకోల్ తెప్పను ఆధారం చేసుకునే దాటాలి. ఇంకోదారి నుంచి పోవాలంటే గ్రామానికి 15 కిలోమీటర్ల దూరం అవుతుంది. ప్రభుత్వం మా బాధలు తీర్చి శాశ్వతంగా బ్రిడ్జీ నిర్మించాలి. – పాసుల ప్రభు, రైతు
సాగుకోసం సాహసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES