మరోసారి ఇరకాటంలో అజిత్ పవార్..
ముంబయి : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఓ మహిళా ఐపీఎస్ అధికారితో ఆయన వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గోవా మాజీ సీఎం, దివంగత నేత మనోహర్ పారికర్ ఎవరంటూ ప్రశ్నించి.. ఇరకాటంలో పడ్డారు. పుణె పర్యటనలో భాగంగా ఈ పరిస్థితి ఎదురైంది. పుణెలోని కేశవ్‌నగర్‌లో స్థానికులతో మాట్లాడిన అజిత్ పవార్.. వారి సమస్యల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారంతా ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యలను లేవనెత్తారు. వీటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ మహిళ మనోహర్ పారికర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన గోవాలో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ.. సమస్యలను స్వయంగా పరిశీలించేవారని, తమ ప్రాంతంలోనూ ఇదే విధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతలోనే అజిత్ పవార్ జోక్యం చేసుకుని.. అసలు పారికర్ ఎవరు? అంటూ ప్రశ్నించడం గమనార్హం. గోవా మాజీ నేత అని ఆమె బదులిచ్చారు. ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఐఐటీ బాంబే నుంచి ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన మనోహర్ పారికర్.. గోవాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజా మద్దతుతో బాధ్యతలను నిర్వర్తించారు. మోడీ తొలి పర్యాయంలో మూడేండ్ల పాటు రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.