టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో అర్హులైన పెండ్లికాని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడపిల్లలకు ఇచ్చే కుటుంబ పెన్షన్‌ను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిలుపుదల చేస్తున్నారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు పీఎమ్ రాజు తెలిపారు. ఆదివారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన బాదిత మహిళలతో కలిసి మాట్లాడారు. ఆడబిడ్డల్ని డిస్కంలోని జీఎమ్ సుధ, సీజీఎంలు వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. వయసుపై బడిన పెండ్లికాని ఆడపిల్లలు తమకు వచ్చే కుటుంబ పెన్షన్లతోనే జీవనం సాగిస్తున్నారనీ, అలాంటి వారికి అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల తల్లిదండ్రులు విద్యుత్ సంస్థల్లో సుదీర్ఘకాలం సేవలు అందించారనీ, వారి వారసత్వంగా కుటుంబ పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు. పెండ్లికాని దళిత ఆడబిడ్డ భువనేశ్వరి కుటుంబ పెన్షన్ పొందుతున్నప్పటికీ, తప్పుడు రూల్‌తో ఆమె పెన్షన్‌ను అన్యాయంగా నిలుపుదల చేశారని ఉదహరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ మంజుల, లక్ష్మీ తదితరుల కుటుంబ పెన్షన్లను కూడా ఇలాగే ఆపేశారని చెప్పారు. పెన్షన్ విభాగంలో అనధికారికంగా జనరల్ మేనేజర్‌గా చలామణి అవుతున్న సుధ అనే ఉద్యోగి కుటుంబ పెన్షనర్లను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పై అధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తక్షణం సీఎమ్‌డీ ముషారఫ్ ఫారూఖీ ఈ అన్యాయంపై విచారణ జరిపి, అర్హులైన ఆడబిడ్డలకు పెన్షన్లను పునరుద్ధరించాలని కోరారు. తప్పుడు కారణాలతో అన్యాయంగా కుటుంబ పెన్షన్లు ఆపినందుకు ఆడబిడ్డలకు పెన్షన్లు వర్తించే తేదీ నుంచి బ్యాంకు వడ్డీతో కలిపి పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ సొమ్మును ఆడబిడ్డల్ని అవమానించిన అధికారుల జీత భత్యాల నుంచి మినహాయించాలని కోరారు.