Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణను వెడ్డింగ్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయం

తెలంగాణను వెడ్డింగ్‌ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయం

- Advertisement -

సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌లో మంత్రి జూపల్లి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పెండ్లి వేడుకలు జరిపించేందుకు ప్రపంచంలోనే ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ద్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని అక్షయ కన్వెన్షన్‌లో పర్యాటక శాఖ సహకారంతో తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండిస్టీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో నాలుగో సౌత్‌ ఇండియా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ కాంగ్రెస్‌ సమ్మిట్‌ జరిగింది. మనదేశంలో పెండ్లీండ్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, అందులో తెలంగాణ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా చూస్తోందని, అలాంటి సమయంలో తెలంగాణను ప్రపంచ పటంలో వివాహ వేడుకల హబ్‌ నిలపాలన్నదే మా సంకల్పమని తెలిపారు. వివిధ థీమ్స్‌, బడ్జెట్లకు అనుగుణంగా పెండ్లీలను జరిపేందుకు అద్భుతమైన వేదికగా తెలంగాణ ఉందనీ, పురాతన కోటలు, రాజమహాళ్లు, దట్టమైన అడవులు, నదులు, సరస్సులు, కొండలు, ఆధునిక విలాసవంతమైన హౌటళ్లు, ఇలా ప్రపంచ స్థాయి వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా మార్చగల ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయని వివరించారు.

వెడ్డింగ్‌ ప్లానర్లు తెలంగాణను కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా ఒక జీవించే సంస్కృతిగా కొత్త దృష్టితో చూపాలని పిలునిచ్చారు. తెలంగాణలో వివాహ వేడుకలను ఎందుకు చేసుకోవాలో తెలిపేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఈ పరిశ్రమను విస్తరించేందుకు ప్రత్యేక పర్యటనలు ఏర్పాటు చేస్తామనీ, లైసెన్సులు, అనుమతులు, లాజిస్టిక్స్‌, వివాహాల నిర్వహణకు అవసరమైన అనుమతులు వేగంగా మంజూరు చేస్తామని తెలిపారు. ప్రయివేటు-పబ్లిక్‌ భాగస్వామ్యంతో ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు సిద్ధం చేస్తున్నామన్నారు. ‘మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం” అనే నినాదంతో పర్యాటక శాఖ ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. రాజస్థాన్‌, పంజాబ్‌, కాశ్మీర్‌, గోవా వంటి భారతదేశంలోని వివిధ సంస్కృతులను ఒకే వేదికపై పరిచయం చేయాలని నిర్వహకులకు సూచించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, టీసీఈఐ అధ్యక్షులు ఆళ్ల బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -