Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23 సవరించాలి

విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23 సవరించాలి

- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పు నుంచి ఇన్‌సర్వీస్‌ టీచర్లకు రక్షణ కల్పించాలి : ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సుప్రీంకోర్టు ఈనెల ఒకటో తేదీన ఐదేండ్ల పైబడి సర్వీసున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లందరూ రెండేండ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనీ, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు నుంచి సీనియర్‌ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టంలో సెక్షన్‌ 23ను సవరించాలని కోరారు. అదే విధంగా టెట్‌ సిలబస్‌, అర్హత ప్రమాణాలను శాస్త్రీయంగా సవరించాలని ఎన్‌సీటీఈని డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌ దోమల్‌గూడలోని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని చావ రవి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అప్‌డేట్‌ కావటానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే 2010, ఆగస్టు 23 కంటే ముందు నియామకమైన టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. 15 ఏండ్ల తర్వాత హఠాత్తుగా రెండేండ్లలో పరీక్ష పాస్‌ కావాలంటే సీనియర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ కారణంగా ఏర్పడే సంక్షోభాన్ని నివారించడానికి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లను దాఖలు చేయాలని ఆయన కోరారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని సవరించాలనీ, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచాలనీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లతో నిర్వహిస్తున్న దేశవ్యాప్త క్యాంపెయిన్‌లో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు.

కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి : వెంకట్‌
ఈ రెండేండ్ల కాలంలో వీలైనన్ని ఎక్కువసార్లు టెట్‌ నిర్వహించి ఉంటే అవసరమైన ఉపాధ్యాయులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా అవకాశం కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ ప్రభుత్వాన్ని కోరారు. డిగ్రీ, బీఎడ్‌ అర్హతలతో ఎస్జీటీలుగా నియామకమైన ఉపాధ్యాయులకు ఓడీఎల్‌ (ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌) పద్ధతిలో జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌)ల ద్వారా డీఎడ్‌ స్వల్పకాలిక శిక్షణను అందించాలని సూచించారు. తద్వారా టెట్‌ పేపర్‌-1 రాసుకోవడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులాల టైంటేబుల్‌ను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జంగయ్య, చావ దుర్గా భవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి చైర్మెన్‌ ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్‌ రాములు, కె సోమశేఖర్‌, వి శాంతికుమారి, ఎస్‌ మల్లారెడ్డి, డి సత్యానంద్‌, కె రవికుమార్‌, ఎ సింహాచలం, బి రాజు, వై జ్ఞానమంజరి, ఎం వెంకటప్ప, కుటుంబ సంక్షేమ నిధి కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, మైనార్టీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ విభాగం రాష్ట్ర నాయకులు మహేష్‌, సురేందర్‌, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, యుటిఎఫ్‌ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జియావుద్దీన్‌ అహ్మద్‌కు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -