Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ

- Advertisement -

బీజేపీ విధానాన్ని తిప్పికొడతాం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి ఆదర్శం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు

నవతెలంగాణ-మెదక్‌ టౌన్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి, ప్రజల మధ్య చీలికలు తెస్తున్న బీజేపీ విధానాలను తిప్పికొడతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్‌ పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలమణి అధ్యక్షతన ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలు – వక్రీకరణాలు’ అనే అంశంపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ సంస్థానంలో వెట్టిచాకిరీ, భావ వ్యక్తికరణపై అంక్షలు, తెలుగు భాషపై అణచివేత, నిరంకుశ ధోరణులు కొనసాగాయని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించేందుకు ఏర్పాటైన ఆంధ్ర మహాసభ నిజాం నవాబ్‌ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిందన్నారు. 1946 నుంచి 1951 వరకు రైతులు, ప్రజలు నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి ప్రజలకు పంచినట్టు తెలిపారు. 3000 గ్రామాలు విముక్తి అయ్యాయని, 4000 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏనాడు పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. నిజాం, భూస్వాములు, జాగీద్దార్లు, జమీందార్లు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ప్రజలు విరోచతంగా పోరాడారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుందన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలపై నిర్భంధాలను ప్రయోగిస్తుందని, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చేందుకు కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కట్టబెట్టాలనే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ. మల్లేశం, కె. మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -