చిన్నతనం నుండి ఆమెకు ఫ్యాషన్ అంటే ప్రాణం. భిన్నమైన దుస్తులన్నా, రంగులన్నా అమితమైన ఆసక్తి. అందుకే ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్‌గా మంచి జీతం సంపాదిస్తున్నా ఆమె మనసు మాత్రం ఫ్యాషన్‌వైపే పరుగులుపెట్టింది. ఇష్టమైన రంగంలో రాణించడానికి చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో పట్టా పొంది సఖ్య పేరుతో దుస్తులను డిజైన్ చేస్తుంది. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కావ్యారెడ్డి. ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ప్రస్తుతం ఓ స్థాయికి చేరుకున్న ఆమెతో మానవి సంభాషణ…
మీ కుటుంబ నేపథ్యం?
మా అమ్మ ధనిరెడ్డి పద్మ, నాన్న హరినాథ రెడ్డి. నాకు తమ్ముడు ఉన్నాడు. పేరు ప్రదీప్ కుమార్ రెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరులో బి.టెక్ పూర్తి చేశాను. తర్వాత సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాను.
మరి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం?
సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో సంతృప్తి పొందలేకపోయాను. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దుస్తుల రూపకల్పన, రంగుల పట్ల ఇష్టం ఉండేది. అప్పటి నుండే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే తపన ఉండేది. అదే నన్ను ఈ రంగంలోకి నడిపించింది. అందుకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ ఫ్యాషన్ ఇండిస్టీలోకి ప్రవేశించాను. దీనికోసం హైదరాబాదులో ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా పూర్తి చేశాను. 2022లో ‘సఖ్య’ Sakya by Kavya Reddy అనే నా సొంత బ్రాండ్‌ను స్థాపించాను. అన్నిరకాల డిజైన్లు చేస్తాను. ప్రతి ఒక్కరి బాడీ స్ట్రక్చర్, రంగు, ఎత్తు, వారి వ్యక్తిత్వాన్ని దృష్టిలో ఉంచుకుని యునీక్‌గా డిజైన్ చేస్తాను.బీచ్‌వేర్, పార్టీవేర్, క్యాజువల్స్ కస్టమర్‌కి ఏం కావాలో ఆ విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేస్తాను.
మహిళగా మీరు ఎదుర్కొన్న సమస్యలు?
ఒక మహిళగా వ్యాపారాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు. మొదట్లో ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యాయి, మానసికంగా ఒత్తిడులు వచ్చాయి. అన్ని రంగాల మాదిరిగానే వ్యాపారంలోనూ మగవారిని, మహిళల్ని వేరుగానే చూస్తారు. ఫ్రాంచైజీ ఓపెన్ చేసి మూసిన అనుభవం ఉంది. అయినా ప్రతిరోజూ పోరాడుతూ, కష్టపడి ముందుకు సాగాను. ఎన్ని సమస్యలు వచ్చినా పోరాడి నిలబడాలని నా అనుభవం నుండి నేర్చుకున్నాను.
దుస్తులకు కావాల్సిన మెటీరియల్ ఎక్కడ నుండి తెస్తారు?
నా దగ్గర సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ముఖ్యంగా ఉప్పడ, మంగళగిరి, వెంకటగిరి, పెద్దాపురం పట్టు లాంటి స్థానిక కాటన్, సిల్క్ చీరలను నేనే డిజైన్ చేసి విక్రయిస్తున్నా ను. ఫాబ్రిక్ ప్రింట్స్ అయితే నా సొంత డిజైన్‌తో తయారవుతాయి. ఒక్కోసారి ఢిల్లీ, సూరత్, ముంబై, కోల్‌కతా, దుబారు లాంటి ప్రదేశాల నుండి కూడా అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్స్ తీసుకుంటాను.
మీరు అందుకున్న పురస్కారాలు?
శ్రీ ధాత్రి అవార్డు, శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి అవార్డు, శ్రేష్ఠత – సాధికారత కోసం HiBiz TV వ్యవస్థాపక అవార్డు, సామాజిక కార్యకర్త అవార్డు, అలాగే కావ్యా రెడ్డి ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, ఫ్యాషన్ ఈవెంట్లలో గౌరవాలందుకున్నాను.
కుటుంబ సహకారం ఎలా ఉంది?
పెండ్లి తర్వాత అనుమతి లేకుండా బయటకు వెళ్లడం మహిళలకు చాలా కష్టం. కానీ నా భర్త నా ఆసక్తి గుర్తించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. మాకు ఒక బాబు ఉన్నాడు. బాబు, ఇల్లు, నా ప్యాషన్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడంలో ఆయన సహకారం చాలా ఉంది.
మీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగం పంచుకుంటున్నారు, వాటి గురించి చెబుతారా?
నేను స్థాపించిన కావ్య రెడ్డీ ఫౌండేషన్ ద్వారా పేదలకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, వికలాంగులకు, దేవాలయాలకు ఆహారం, దుస్తులు వంటివి విరాళంగా ఇస్తున్నాను. మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న మానవతా సేవలు సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఓ వ్యాపారవేత్తగా మహిళలకు మీరిచ్చే సలహా?
ప్రతి మహిళా కచ్చితంగా ఆర్ధిక స్వాత్యంత్రం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసే వారు లేకపోతే, మన పిల్లలను చూసుకునే బాధ్యత మన మీదే ఉంటుంది. పిల్లల కోసం అనే కాదు ప్రతి మహిళా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. దీనికోసం ఆర్థిక స్వావలంబన ముఖ్యం.
వ్యాపారంలో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు?
నాకు ఎవరూ పోటీ కాదు. ఎందుకంటే నాకంటూ నా సొంత సిగేచర్ స్టైల్ ఉంది. చాలా మంది ఇంట్లో చీరలు అమ్ముతూ పోటీగా కనిపించవచ్చు. కానీ నేను వేరే స్థాయిలో ప్రత్యేకత ఉన్న కాన్సెప్ట్‌లను, వీఐపీ క్లయింట్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నాను. వెయ్యి రూపాయల నుండి ఐదు లక్షల వరకు ధర పలికే కాస్ట్యూమ్స్ నా దగ్గర ఉంటాయి. అయితే ధర అనేది ఫ్యాబ్రిక్, వర్క్, డిజైన్‌పై ఆధారపడి ఉంటాయి. మా డిజైన్లు అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉండేటట్లు చూసుకుంటాను. వారు కోరిన బడ్జెట్‌లో క్వాలిటీకి, డిజైన్‌కి ఏమాత్రం తగ్గకుండా రూపొందించటం మా ప్రత్యేకత.
- పాలపర్తి సంధ్యారాణి