
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే చొరబాటకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని తిప్పికొట్టారు. కేరీ బత్తల్ ఏరియా వద్ద ఉన్న ఓ నది సమీపంలో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. అలర్ట్‌గా ఉన్న ఆర్మీ వారి కదలికలపై కన్నేసింది. ఆ ఉగ్రమూకలపై సైన్యం ఎదురుకాల్పులు చేసింది. తొలుత గాయపడ్డ జేసీవో ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అదనపు బలగాలతో కార్డన్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అక్నూర్ సెక్టార్ వద్దే ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. ఉగ్రవాదులు ఐఈడీ పేల్చడంతో ఓ కెప్టెన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో తాజా ఇండోపాక్ బ్రిగ్రేడ్ కమాండర్ స్థాయి మీటింగ్ జరిగిన తర్వాత ఎన్‌కౌంటర్ జరగడం శోచనీయం. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు బ్రిగేడియర్ స్థాయి చర్చలు జరిగినా ఫలితం లేకుండా ఉంది. సీమాంతర ఉగ్రవాద చర్యలను, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లాంటి అంశాలపై ఆ చర్చల్లో భారతీయ ఆర్మీ నిరసన వ్యక్తం చేసింది.