Tuesday, September 16, 2025
E-PAPER
Homeజాతీయంమొత్తంగా స్టే విధించలేం

మొత్తంగా స్టే విధించలేం

- Advertisement -

వక్ఫ్‌ సవరణ చట్టంపై సుప్రీం స్పష్టీకరణ
కొన్ని కీలక సెక్షన్ల అమలు నిలిపివేత
ఐదేండ్ల ఇస్లాం అమలు నిబంధనపై విధి విధానాలు కావాలి
ఆ నిబంధన అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధం
వక్ఫ్‌ బోర్డులో మెజారిటీ ముస్లిం సభ్యులుండాలి
కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వక్ఫ్‌ సవరణ చట్టంలోని కొన్ని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఆగస్టిన్‌ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తికి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌గా చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధన (సెక్షన్‌ 3)ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు ముస్లిం మతాన్ని ఆచరించడమంటే వాటికి గల నియమనిబంధనలు, విధి విధానాలేమిటో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకు ఈ నిబంధనను నిలిపివేస్తున్నట్లు జస్టిస్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సెక్షన్‌ 3తో పాటు 9, 14, 23, 36, 107, 108 సెక్షన్లను కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే మరికొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది.వక్ఫ్‌, వక్ఫ్‌ వాటాదారుల హక్కులను జిల్లా కలెక్టర్‌ వంటి ప్రభుత్వ అధికారులు నిర్ణయించడానికి అనుమతించడమనేది అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా వుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే వక్ఫ్‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్ఛితంగా మెజారిటీలోనే వుండాలని స్పష్టం చేసింది. బోర్డులో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు వుండొచ్చని సూచించింది. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తే వుండటం మంచిదని అభిప్రాయపడింది.

నిలిపివేయబడిన నిబంధనలు
సెక్షన్‌ 3 (ఆర్‌) : ఆస్తిని వక్ఫ్‌కు దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన నిలిపివేయబడింది. ఎందుకంటే, దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం వుందని కోర్టు అభిప్రాయపడింది.
సెక్షన్‌ 2(సి): నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్‌ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన కూడా నిలిపివేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరు.
సెక్షన్‌ 3 సి: రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసే అధికారం కలెక్టర్‌కు ఇవ్వడమనేది అధికారాల విభజనకు వ్యతిరేకం. అధికారులు తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులేవీ ప్రభావితం కావు.

ఇతర ముఖ్య నిబంధనలు
– వక్ఫ్‌ బోర్డులో నలుగురి కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు ఉండకూడదు. రాష్ట్ర స్థాయిలో ముగ్గురి కంటే ఎక్కువ ఉండరాదు.
– వక్ఫ్‌ బోర్డు ఎక్స్‌-ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారై ఉండాలి.
– వక్ఫ్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ముస్లిం సమాజానికి చెందినవారై ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ముస్లిమేతర వ్యక్తిని సిఇఒగా నియమించే సవరణను మాత్రం నిలిపివేయలేదు.
– తుది తీర్పు వచ్చే వరకు వక్ఫ్‌ ఆస్తుల హక్కులు, స్వాధీనం ప్రభావితం కావు

మొత్తంగా చట్టంపై స్టే విధించలేం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
1923 నుంచి వక్ఫ్‌ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తంగా చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని, అందువల్ల మొత్తంగా చట్టంపై స్టే విధించలేమని చీఫ్‌ జస్టిస్‌ బి.ఆర్‌ గవారు తెలిపారు. చట్టసభలు ఆమోదించిన చట్టం రాజ్యాంగబద్ధమనే భావనతోనే అత్యున్నత న్యాయస్థానం ఎల్లప్పుడూ వ్యవహరిస్తుందని, అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే సవాలు చేయబడిన చట్టం అమలుపై స్టే విధించాల్సి వస్తుందని గవారు నేతృత్వంలోని బెంచ్‌ వ్యాఖ్యానించింది. అంతిమంగా, వక్ఫ్‌ సవరణ చట్టం-2025 మొత్తంగా చెల్లుబాటు అవుతుంది. కానీ కొన్ని నిబంధనలకు చేసిన నిర్దిష్ట సవరణలపై స్టే విధించింది. వాటిల్లో 3, 9, 14, 23, 36, 104, 107, 108 సెక్షన్లు వున్నాయి. వాటి చట్టబద్ధతను, 1923 నాటి చట్టం చరిత్రను ప్రాధమికంగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెక్షన్‌ 3(ఆర్‌), 2(సి), 3 (సి) వంటి వివాదాస్పద నిబంధనలు మాత్రం కేంద్రం తగిన నియమాలు లేదా ఒక యంత్రాంగాన్ని రూపొందించే వరకు అమలులో వుండవని, స్టే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అటువంటి ఒక యంత్రాంగం లేకపోతే ఇటువంటి నిబంధనలు ఏకపక్షంగా అధికారాలను దర్వినియోగం చేయడానికి దారి తీస్తాయని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. మొత్తంగా చట్టంపై స్టే ఇవ్వడానికి తిరస్కరించడం వల్ల, అలాగే తీర్పులో చేసిన వ్యాఖ్యల వల్ల 2025 నాటి సవరణ చట్టాన్ని, దాని నిబంధనలన్నింటినీ సమగ్రంగా సవాలు చేయడానికి ఆయా పక్షాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లబోదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 అమలును పూర్తిగా నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాదాపు వందకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తులను లాగేసుకోవడానికికే ఈ సవరణలు ఉద్దేశించబడ్డాయంటూ ఆ పిటిషన్లు ఆరోపించాయి. అయితే వక్ఫ్‌ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా వుండేందుకే ఈ చర్యలని కేంద్రం కూడా వాదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -