Monday, October 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపొద్దంతా లైన్లో ఉన్నా కొందరికే..

పొద్దంతా లైన్లో ఉన్నా కొందరికే..

- Advertisement -

పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాల పంపిణీ
కార్యాలయాల వద్ద పడిగాపులు

నవతెలంగాణ- విలేకరులు
యూరియా కష్టాలు రైతులకు ఇంకా తీరడం లేదు. పొద్దంతా లైన్‌లో నిలుచున్నా యూరియా బస్తాలు అందక ఆందోళనకు గురవుతున్నారు. వచ్చిన యూరియా బస్తాలు తక్కువ.. రైతులు ఎక్కువగా ఉండటంలో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. సకాలంలో యూరియా వేయక పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని దిగులు చెందుతున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతులు సోమవారం లైన్లలో పడిగాపులు కాచారు. కొన్ని చోట్ల ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు సరిపడా యూరియా అందించాలని ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ పీర్‌సింగ్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రైతులకు సరిపడా యూరియా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బేలలో డోప్టాల సహకార సంఘం, అన్నదాత ప్రయివేట్‌ షాప్‌కు 888 బస్తాల యూరియా రావడంతో ఉదయం నుండే ఆయా దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. రెండు వారాల నుంచి మార్కెట్‌లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు పెద్దఎత్తున బారులు తీరారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలో సొసైటీలతో పాటు ఫర్టిలైజర్‌ షాప్‌ల వద్ద తెల్లవారు జామునుంచే లైన్‌ కట్టారు.

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డును దిగ్బంధించారు. చెన్నూర్‌ మండలం కిష్టంపేట్‌ రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల-చెన్నూర్‌ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. జైపూర్‌ మండలం టేకుమట్ల, ఇందారం గ్రామాల రైతులు యూరియా కోసం రైతు వేదిక వద్ద లైన్లు కట్టి పడిగాపులు కాశారు. శివ్వారం, పౌనూర్‌ గ్రామాలకు చెందిన రైతులు చెప్పులను వరుసలో పెట్టారు. జన్నారం మండలం పొన్కల్‌ ప్రాథమిక వ్యవసాయశాఖ కార్యాలయానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులను లైన్‌లో నిల్చోబెట్టి ఏఓ సంగీత సహకారంతో టోకెన్లు అందజేశారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలోని చిన్న రాస్సేళ్లి గ్రామంలో గిరవెల్లి వైపు వెళ్తున్న యూరియా లారీని రైతులు అడ్డుకున్నారు.

చిన్న రాస్పల్లి గ్రామంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇదే గ్రామంలో పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘటన స్థలానికి తహసీల్దార్‌ మునవర్‌ షెరీఫ్‌, ఏఓ రామకృష్ణ వెళ్లి రైతులతో మాట్లాడి నచ్చజెప్పారు. గిరవెల్లి రైతువేదిక వద్ద చిన్న రాస్పల్లి రైతులకు కూడా యూరియా పంపిణీ చేస్తామని చెప్పడంతో.. రైతులు శాంతించి.. గిరవెల్లి వద్దకు వెళ్లి యూరియా తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో వ్యవసాయ సహాయ సహకార సంఘం ఎదుట నాగార్జున సాగర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రైతులు బైటాయించి ధర్నా నిర్వహించారు.ఉదయం 6 గంటల నుంచీ క్యూలో నిలబడినా సగం మందికి కూడా యూరియా అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసు పహారాలో యూరియా టోకెన్ల పంపిణీ
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరుశురాంపల్లి, గణపురం సొసైటీ, ఆగ్రోస్‌కు యూరియా బస్తాల లారీ వచ్చింది. రైతులు లైన్‌లో చెప్పులు పెట్టి నిల్చున్నారు. ఎస్‌ఐ రేఖ అశోక్‌ రైతులను లైన్‌లో నిలబెట్టి యూరియా పంపిణీ చేయించారు. చిట్యాల మండలంలో మన గ్రోమోర్‌ ముందు కూడా పోలీసుల బందోబస్తులో రైతులకు యూరియా పంపిణీ చేయించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పాలకుర్తి సొసైటీ తోపాటు, గ్రోమోర్‌, ఆగ్రోస్‌ 2, తొర్రూరు సొసైటీల వద్ద పోలీసు బందోబస్తు మధ్య యూరియా అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -