బస్తాకు రూ.800 ఇస్తామన్న సిఎం
త్వరలో విధివిధానాలు రూపకల్పన
జిల్లాల అభివృద్ధిలో కలెక్టర్లదే కీలకపాత్ర
కలెక్లర్ల కాన్ఫరెన్స్‌లో వెల్లడి
అమరావతి : రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకం ఇద్దాం. బస్తాకు 800 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేద్దాం’ అని సిఎం అన్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ సోమవారం ప్రారంభమైంది. సిఎస్ విజయానంద్ ఈ సమావేశానికి అధ్యక్షతన వహించారు.సిసిఎల్‌ఎ కమిషనరు జయలక్ష్మీ స్వాగతోపన్యాసం చేశారు. తొలిరోజు ,ప్రాధమిక, పరిశ్రమలు, సేవారంగాలు, సూపర్6, పి4, సర్క్యులర్ ఎకానమీ, లాజిస్టిక్స్, సంక్షేమం, అభివృద్ది తదితర రంగాలపై సిఎం సమీక్షించారు. వ్యవసాయశాఖపై జరిగిన సమీక్షలో సిఎం యూరియా కొరత అంశాన్ని ప్రస్తావించారు.
యూరియా వినియోగం పెరిగితే క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా వినియోగం ఎక్కువైతే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందనేదానికి పంజాబ్ రాష్ట్రం ఓ కేస్‌స్టడీ అని సిఎం పేర్కిన్నారు. ప్రన్తుతం రాష్ట్రం క్యాన్సర్ కేసుల్లో టాప్-5లో ఉందని, యూరియా వినియోగం మరింతగా పెరిగితే టాప్-1కు వెళ్లిపోతుందన్నారు. ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విధానం తీసుకురావాలని సిఎం చంద్రబాబు చెప్పారు. పిఎం ప్రణామ్ కింద బస్తాకు రూ.800లను ప్రోత్సాహకంగా కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందని ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే రైతులకు ఇవ్వడం ముఖ్యమన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించాలని సిఎం కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు.
మానవీయ కోణంలో ఆలోచించండి
అంతకుమందు ప్రారంభోపన్యాసంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఆఫీసులో కూర్చొని పేపర్‌మీద చూస్తే అంతా చక్కగా ఉంటుందని, క్షేత్రస్ధాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రధాని, సిఎం తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తులు కలెక్టర్లని, జిల్లాలను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన బాధ్యత వారిదేనని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లేనని, సిఎస్, డిజిపిల నుంచి క్షేత్ర స్దాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామన్నారు. సమర్ధులైన వారికే కలెక్టర్ల పోస్టింగ్‌లిచ్చామని సిఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో శాంతి భద్రతల విషయంలో కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలన్నారు. తాను అధికారులకు సపోర్టుగా ఉంటానని, కానీ విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్‌ను సృష్టించాలన్నారు.
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపామని, వాణిజ్యపంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని సిఎం కలెక్టర్లకు సూచించారు. గతంలో భూ వివాదాలను సృష్టించారని రెవెన్యూ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. దీన్ని సరిచేయాలని, రిజిస్ట్రేషన్ పత్రాలను ట్యాంపర్ చేయకుండా ఉండేలా రూపొందించే విధానం ఉండాలన్నారు. ఇక జిఎస్‌టి రెండో దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవడంతో పాటు ఒక నెల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఎం పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ ముఖ్యమైన అంశం కావాలని సిఎం అన్నారు. సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీలు, అభివృద్ది , ఎదురయ్యేసవాళ్లపై .అందరూ దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర అభివృద్దికి పెట్టుబడులకు 23 పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జిఎస్‌డిపి అభివృద్దితో పాటు విజన్ తదితర అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ఆర్ధికాభివృద్ది, ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు సమగ్రాభివృద్దిపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు.