తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం… ఒక్క తెలంగాణలోనే కాదు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న మహోజ్వల ఘట్టం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం. ఇందులో మహిళలు చేసిన త్యాగాలకు, చూపిన తెగువకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాలుగ్గోడలు దాటి అడుగు బయటపెట్టేందుకే స్వేచ్ఛలేని మహిళలు అన్యాయాన్ని ఎదిరించారు. బందూకులై దోపిడీపై తిరగబడ్డారు. వొడిసేలలు పట్టి రజాకార్లపై ఎగబడ్డారు. అన్యాయాలపై, తమ హక్కులకై గొంతు విప్పారు. అలాంటి గొప్ప పోరాటం నేటి మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి శిఖరంగా నిలిచిందంటూ తమ అనుభవాలను మహిళా నేతలు మానవితో పంచుకున్నారు.
ఓ చారిత్రక శిఖరం
నా బాల్యం మొత్తం ఉత్తర తెలంగాణలో సాగింది. అది సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ఉద్యమాలు సాగుతున్న కాలం. అప్పట్లో విప్లవ సాహిత్యం విరివిగా వచ్చేది. అలాగే అప్పటికే జరిగిన తెలంగాణ సాయుధపోరాటం, శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట ప్రభావం రాష్ట్రంపై బాగా ఉండేది. ఈ అన్ని ఉద్యమాల్లో మాకు బాగా తెలిసి, ప్రభావితం చేసింది తెలంగాణ సాయుధ పోరాటం. సుందరయ్య, రావినారాయణ రెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, వేల్పుల వెంకటేశ్వరావు, వరవరరావు వంటి వారు రాసిన పుస్తకాలు మాకు ఎన్నో నేర్పాయి. వీటితో పాటు ‘మనకు తెలియని మన చరిత్ర ‘ అనే పుస్తకం కూడా చాలా ప్రభావితం చేసింది. దీని రూపకల్పనలో నా పాత్ర కూడా ఉంది. దాంతో అది నన్నెంతో ప్రభావితం చేసింది. అప్పట్లో నాయకులు అన్నపూర్ణమ్మ, లచ్చమ్మ, రంగమ్మ వంటి వారు అనేక త్యాగాలు చేశారు. మల్లుస్వరాజ్యం, రాములమ్మ, రాంబాయమ్మ, మల్లికాంబ వంటి వారి గురించి బాగా చెప్పేవారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితమైన కాలంలో స్త్రీపురుషుల సమానత్వం అనే అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. తుపాకి పట్టి మగవారితో సమానంగా ఉద్యమాల్లో భాగం పంచుకున్నారు. గ్రామ గ్రామాల్లో మహిళల్లో ధైర్యాన్ని నింపిన ఉద్యమం ఇది. కేవలం భూమి కోసమే కాకుండా కుల, లింగ వివక్షపై కూడా ఉద్యమించారు. సుందరయ్యగారి రచనల ప్రకారం ఈ ఉద్యమంలో మూడువేల మంది మహిళలు ప్రత్యక్షంగా పాల్గొంటే లక్ష మందికి పైగా మహిళలు పరోక్షంగా భాగం పంచుకున్నారు. మహిళలకు పసుపు కుంకుమ పేరుతో ఆస్తిలో వాటా ఇప్పించాలి అనే డిమాండ్ అప్పుడే ముందుకు తెచ్చారు. స్త్రీల హక్కులను బయటకు వినిపించేలా చేశారు. లైంగిక దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించారు. మహిళా ఉద్యమాల అవసరాన్ని గుర్తించేలా చేసిన ఉద్యమం తెలంగాణ సాయుధపోరాటం. మాలాంటి మహిళా సంఘాలు ఏర్పడటానికి పునాదులు వేసింది.
– సంధ్య.
మహోజ్వల పోరాటం
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర మహోజ్వలమైనది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం 1946 సెప్టెంబర్ 11వ తేదీ నుండి 1951 అక్టోబర్ 21 వరకు ఐదేండ్ల పాటు సాగింది. పోరాట ఫలితంగా 3000 గ్రామాలు విముక్తి అయ్యాయి. 4000 మంది వీరమరణం పొందారు. 10 లక్షల ఎకరాలు పంచిన ఘనత ఈ పోరాటానికి దక్కింది. కులాలకు, మతాలకు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా సాగిన మహా పోరాటం ఇది. ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించినబడిన ఈ పోరాటంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా కీలక భూమిక పోషించారు. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వీర వనితలు ఈ ఉద్యమం నుండి ఉద్భవించిన నాయకులే. మహిళలను చైతన్య పరిచి, దళాల్లో చేర్చి బందూకులు పట్టడంలో, తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చారు. ఈ మహత్తర పోరాటానికే ఐలమ్మ చిహ్నంగా నిలిచింది. ఇందులో స్త్రీలు చేసిన త్యాగాల గురించి ప్రస్తావించాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. మహిళలు పోరాటాలలోకి రావాలంటే గ్రామ ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలని నాయకత్వం పిలిపిస్తే మల్లు స్వరాజ్యంతో పాటు మరో నలుగురు దళ సభ్యులు కలిసి ఆ దిశగా తమ ప్రయాణం సాగించారు. ప్రజలకు, మహిళలకు ధైర్యం చెప్పారు. ప్రజలందరినీ ఒకటిగా చేసి సంఘంలో చేరేలా చైతన్యపరిచారు. పోరాడితే స్వేచ్ఛగా బతకవచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చారు. అలా చైతన్యం పొంది ఎంతో మంది మహిళలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దొరలు, భూస్వాములు, రజాకార్లు మహిళలపై సాగిస్తున్న లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. తమ హక్కుల కోసం మహిళలు గొంతు విప్పిన ఉద్యమం కూడా ఇదే. అందుకే నేటి మహిళా సంఘాలకు, ఉద్యమాలకు తెలంగాణ సాయుధ పోరాటం ఓ పునాది వంటిది. ఆ పోరాట వీరుల చరిత్ర, త్యాగాలు కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వారు ఆ గొప్ప చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మనుధర్మం, సనాతన ధర్మం పేరుతో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. అందుకే సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మహిళలు తమ హక్కులను కాపాడుకునేందుకు మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మల్లు లక్ష్మి
స్ఫూర్తినింపిన ఉద్యమం
తెలంగాణ సాయుధ పోరాటానికి ఖమ్మం జిల్లాలోని పిండిబ్రోలు అనే గ్రామం ఒక కేంద్రంగా ఉండేది. మా మేనత్త రాంబాయమ్మ ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. అయినా ఉద్యమాల్లో పాల్గొనే వారి అవసరాలు చూసుకునేది. అంతేకాదు అప్పట్లో గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఊరూరూ తిరిగి చైతన్యం చేసేవారు. అందుకే ఆమెను అరెస్టు చేశారు. వరంగల్ జైల్లో ఉండి మహిళలకు రుతుస్రావం సమయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పోరాడుతూ ఆ ఘర్షణలో జైల్లోనే చనిపోయింది. అలాంటి మహిళల చరిత్ర చదువుకుంటూ పెరిగాను. ఆ ప్రభావం నాపై బాగా ఉండేది. ఆనాడు వితంతు మహిళలు ఎదుర్కొనే సమస్యలు అత్యంత ఘోరంగా ఉండేవి. అట్టడుగు మహిళలను దొరల గడిలో ఉంచి లైంగికంగా దోపిడీ చేసేవారు. అటువంటి దారుణాలపై సాయుధులై పోరాడిన ఆరుట్ల కమలాదేవి, మల్లుస్వరాజ్యం, రంగమ్మ వంటి వారి చరిత్ర విన్నప్పుడు మాలో స్ఫూర్తి నిండేది. భూస్వామ్య విధానాన్ని వ్యతిరేకిస్తూనే స్త్రీల జీవితాల మెరుగుదల కోసం వారు చేసిన పోరాటం మాలో స్ఫూర్తిని నింపింది. దాని కొనసాగింపుగా ఉద్యమాలు నడిపే శక్తిని మాకు అందించాయి. ఒకప్పుడు చదువు లేకుండా ఇంటికే పరిమితమైన మహిళలు నేడు బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివక్షకు గురవుతూనే ఉన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా పని చేయడం లేదు. ఇప్పటికీ లైంగిక దోపిడీకి గురవుతూనే ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం పొందలేకపోతున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాటానికి మాలాంటి వాళ్లకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– ఝాన్సీ.