Wednesday, September 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసెప్టెంబర్‌17 ప్రాముఖ్యత - వాస్తవాలు, వక్రీకరణలు

సెప్టెంబర్‌17 ప్రాముఖ్యత – వాస్తవాలు, వక్రీకరణలు

- Advertisement -

1948 సెప్టెంబర్‌ 17 తెలంగాణా చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఆరోజు నిజాం ప్రభువు భారత సైన్యాలకు లొంగిపోయి, అప్పటివరకూ విడిగా ఉన్న ‘హైద్రాబాద్‌ సంస్థానం’ భారతదేశంలో కలిపివేయబడింది. వివిధ రాజకీయ పార్టీలు ఈ రోజును విమోచనదినమనీ, విలీన దినమనీ, విద్రోహదినమనీ రక,రకాలుగా వ్యాఖ్యా నిస్తున్నాయి. ఇక బిజెపినైతే ఏకంగా ముస్లింరాజును ఓడించిన హిందువుల విముక్తి దినమని వక్రీకరించేంతగా సాహసిస్తున్నది. వ్యక్తులుగా ఈరోజు గురించి ఎవరికి ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు గానీ, ఈ నిర్వచనాలన్నింటినీ ఆనాడు సాగిన మహత్తర ‘తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటా’నికి ఆపాదించటమే అభ్యంతరకరం. ఏనుగు- నలుగురు గుడ్డివాళ్ల కథలో ఒకడు చెవును పట్టుకుని ఏనుగు చేటలాగా ఉంటుందనీ, కాలు పట్టుకున్నవాడు ఏనుగు స్తంభం లాగా ఉంటుందనీ, మరొకడు తోకపట్టుకుని ఏనుగు తాడులాగా ఉంటుందనీ చెపితే ఏనుగు ఏనుగు కాకుండా పోతుందా? కొన్ని ఘటనల్లో, పోరాటంలోని కొన్ని ధోరణులు మాత్రమే చూపి ‘తెలంగాణా సాయుధ పోరాటాన్ని’ మసిబూసి మారేడుకాయ చేయటం సాధ్యం కానే కాదు.

నిజాంప్రభువు ఉస్మాన్‌ అలీఖాన్‌ నిరంకుశ, ప్యూడల్‌ పాలనకు వ్యతిరేకంగా రైతాంగానికి భూమిపై హక్కులు కావాలనీ, పేదలకు భూమి పంచాలనీ, సబ్బండకులాలు వెట్టిచాకిరీ నుండి విముక్తి కావాలనీ, మహిళలపై లైంగికదాడులు అంతం కావాలనీ ‘భూమి, భుక్తి, రాచరిక విముక్తి’ కోసం 1946 సెప్టెంబర్‌ నుండి 1951అక్టోబర్‌ దాకా సాగిన మహత్తర పోరాటం ‘తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం’. ఈ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడింది. మూడు వేల గ్రామాలతో విముక్తి ప్రాంతం ఏర్పడి గ్రామ రాజ్యాలు నడిచాయి. పటేల్‌,పట్వారీలు గ్రామపెత్తందార్లు, జాగీర్‌, జమీందార్లు, భూస్వాములు గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయారు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల ఆధ్యర్యంలో సాగిన ఈ పోరాటంలో నిజాం సైన్యాలు, రజాకార్లు, నెహ్రూ సైన్యాల చేతుల్లో నాలుగు వేల మంది కమ్యూని స్టులు హతులయ్యారు. ఈ కాలంలోనే దేశంలో అనేక రైతాంగ పోరాటాలు పెల్లుబికాయి. వీటన్నింటిలో తెలంగాణా సాయుధ పోరాటం అగ్రభాగాన నిలుస్తుంది. ఈ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నది. ఈ పోరా టాల ప్రభావంతోనే తర్వాత స్వతంత్ర భారత దేశంలో అనేక కౌలుదారీ చట్టాలు, భూసంస్కరణల చట్టం తీసుకురావటం పాలకవర్గాలకు తప్పనిసరైంది. ఈ నేపథ్యం లోనే మనం వివిధ వ్యాఖ్యానాలను పరిశీలించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్‌ 17ను విమోచనం అనటమంటే.. దేనినుండి విమోచన జరిగింది. నిజాం పాలన పోవడమే ఒక్కటే కోరుకున్నవాళ్లకు అది విమోచన కావచ్చు. కానీ తెలంగాణా పోరాట లక్ష్యాలు ఒక్క నిజాం పాలన పోవటం మాత్రమే కాదు. ఆనాడు సాగిన సమస్త ఆర్థిక, సామాజిక దోపిడీ, పీడనల నుండి విముక్తి జరగాలి. అది జరగలేదు. పైగా ఆ పోరాటంలో సాధించుకున్న భూములు, హక్కులు అనేకం తర్వాత కాంగ్రెస్‌ పాలనలో హరించి వేయబడ్డాయి. అది విమోచన ఎలా అవుతుంది? ఇక విలీన దినమని చెప్పటం ఒక వాస్తవాన్ని సూచిస్తుంది. ఎందుకంటే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చినా తెలంగాణా ప్రజలకు రాలేదు. సాయుధపోరాటం సాగుతున్న ఉధృతి గమనించిన నెహ్రూప్రభుత్వం దాన్ని అణచివేసే లక్ష్యంతోనే 1948 సెప్టెంబర్‌ 13న తెలంగాణాకు సైన్యాలను పంపించింది. నాలుగు రోజుల్లోనే, ఒక్క రక్తపుబొట్టు చిందకుండానే సెప్టెంబర్‌ 17న చర్చలద్వారా నిజాం లొంగిపోయాడు. ఆ రాజీలో నిజాంకు ‘రాజ్‌ప్రముఖ్‌’ అనే బిరుదు నిచ్చి, అపార ధనరాశుల రాజ భరణం ఇచ్చి నెహ్రూ ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.

ఆ విధంగా తెలంగాణా భారతదేశంలో విలీనమైంది. ఇది పైకి మనం ఆహ్వానించే విషయమే అయినప్పటికీ, అసలు కథ అపుడే మొదల యింది. ఈ పరిణామం తెలంగాణా పీడిత ప్రజలకు నష్టదా యకంగా పరిణమించిందనే చెప్పాలి. ఈ విలీనం తర్వాత నెహ్రూ సైన్యాలు పోరాట దళాలపైన విరుచుకుపడ్డాయి. పోరాటంలో చనిపోయిన నాలుగు వేల మంది వీరుల్లో ఎక్కువ మందిని 48తర్వాత నెహ్రూ సైన్యాలే చంపాయి. అప్పటివరకూ పట్టణాలకు పారిపోయిన భూస్వాములు ఈ సైన్యాల అండతో గ్రామాలకు చేరి తిరిగి భూములు లాక్కున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ సైన్యాల జోక్యం లేకపోయి ఉంటే అనతికాలంలోనే నిజాం ప్రభుత్వం రైతాంగ సాయుధపోరాట ఫలితంగా అంతమై కమ్యూనిస్టుల ఆద్వర్యంలో ‘ప్రజారాజ్యం’ ఏర్పడి ఉండేది. పోరాటంలో సాధించిన భూములు, హక్కులు సంఘటిత పరచబడి తెలంగాణా సమాజం మరింత అభివృద్ధికి నోచుకునేది. అలా జరగనం దుకు మనం విలీన ఉత్సవాలు జరపాలా?

కొందరు పోరాట విరమణ చేయటం విద్రోహంగా భావిస్తు న్నారు. సాయుధ పోరాటం ఒకసారి ప్రారంభిస్తే రాజకీయ విముక్తి సాధించేదాకా విరమించరాదనే ఒక పిడివాదం ఇందులో ఇమిడి ఉండవచ్చు. నిజాం ప్రభుత్వం లొంగిపోయాక కూడా నెహ్రూ ప్రభుత్వాన్ని దించటం లక్ష్యంగా ఉండాలనే భావన ఈ వాదనకు దారితీస్తుంది. తెలంగాణా సాయుధ పోరాటంలో 1947 అగస్టు 15కు ముందు దశ, అక్కడినుండి 48 సెప్టెంబరు 17వరకూ రెండోదశ, తరువాత 51అక్టోబర్‌లో విరమణ వరకూ చివరి దశగా భావిస్తే ఈ దశల్లో మారిన బలా,బలాలు ఉద్యమ ఎత్తుపల్లాలు, ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పులు గమనించినట్లైతే ఈ వాదనలో ఏమాత్రం పసలేదని తేలిపోతుంది. అయితే నిజాం ప్రభుత్వం కూలిపోయాక కూడా 51వరకూ సాయుధ పోరాటం సాగించటం సరైందేనా అనే సమస్య ఉంటుంది. ఈ సమస్య అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ సహకారంతో ఆనాడే పరిష్కరించుకోవటం జరిగింది. సాయుధ పోరాటాలనేవి రాజకీయ ప్రభుత్వాల మార్పిడికోసం జరిగే విప్లవాల అర్ధంలోనేకాక, ప్రజలు సిద్ధపడితే ఒక ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక కోర్కెల సాధనకోసం కూడా ప్రారంభించవచ్చనీ, ఆ కోర్కెలు సాధనలో ప్రజల సంసిద్దతనుబట్టి విరమించవచ్చనీ కూడా ఆనాటి ఆ చర్చల్లో నిర్దారణకు రావటం జరిగింది. సాధించుకున్న భూముల రక్షణ కోసమే 51వరకూ పోరాటం కొనసాగించబడింది తప్ప నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో కాదు. కాబట్టి తెలంగాణా సాయుధ పోరాట విరమణ గురించిన తప్పుడు అభిప్రాయాలు కూడా వాదనకు నిలబడేవి కావు.

ఇక ఇపుడు బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకులు చేసే ముఖ్య మైన వక్రీకరణ ఏమిటంటే? తెలంగాణా పోరాటం ముస్లిం రాజును దించటానికి హిందువులు చేసిన పోరాటమనేది వారి వాదన. దీనికి వారు చూపే ఆధారాలు ఏమిటి? తెలంగాణా సాయుధ పోరాట పత్రాలు, తీర్మానాలు, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల పిలుపులు ఎక్కడైనా అలాంటి ఆధారాలు చూపగలరా? ఏ హిందూనాయకులు ఎక్కడ, ఏ పోరాటాలు ముస్లిం రాజుకు వ్కతిరేకంగా చేసారో చెప్పగల రా? అసలు మీ (బీజేపీ,ఆరెస్సెస్‌) నాయకులు ఏ పోరాటంలో పాలొ ్గన్నారో చెప్పగలరా! స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? నిజాం వ్యతిరేక సాయుధపోరాటంలో పాల్గొన్నారా? లేదు గదా. పైగా బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఊడిగం చేసిన చరిత్ర కాదా మీది? ఈ నాయకులు చెబుతున్నదీ, చెప్పగలిగేదీ ఒక్కటే. అదేమంటే ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ‘ఆర్య సమాజ్‌’ పోరాడిందని చెబుతారు. ఇందులో ఉన్న వాస్తవమెంత?

ఆర్యసమాజ్‌ 1892లో హైద్రాబాద్‌లో స్థాపించ బడింది. ప్రారంభంలో దీని కార్యకలాపాలు మత సంస్క రణల కోసం సాగినా తర్వాత రాజకీయాలూ ప్రవేశిం చాయి. మరోవైపు నిజాం ప్రభుత్వం అన్నిమతాలూ సమానమని, అందరినీ ప్రేమించాలని విధాన ప్రకటనలు చేసినా, బహదూర్‌ యార్‌ జంగ్‌ నాయకత్వంలోని మజ్లిస్‌ పార్టీని బలపర్చేది. ఈ పార్టీకి 1946-48కాలంలో ‘రజాకార్‌’ నాయకుడు ఖాసింరజ్వీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన తర్వాత ఎం.ఐ.ఎంకు అబ్దుల్‌ వహీద్‌ ఓవైసీ (లాయర్‌) అధ్యక్షుడయ్యాడు. ఆయన మరణం తర్వాత కొడుకు సలాఉద్దీన్‌ ఓవైసీ, ఆయన తర్వాత ఆయన కొడుకు నేటి అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ నాయకత్వంలోకి వచ్చారు. హైద్రాబాద్‌ మతకలహాలకు రజాకార్‌ నాయకుడు ఖాసింరజ్వీ నాయకత్వం వహించాడు. అతను ప్రజలపైన దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా సాగించేవాడు. ఈ భాదితుల్లో హిందువులు ఎక్కువగా ఉండేవారు.

రజాకార్లు నిజాంకు ప్రైవేటు సైన్యంగా ఉపయోగపడేవారు. ఈ క్రమంలో మజ్లిస్‌, ఆర్యసమాజ్‌ మధ్య కొన్ని ఘర్షణలు జరిగేవి. ఆర్య సమాజ్‌ కార్యకలాపాలు ప్రధానంగా నిజాం సంస్థానంలోని మరట్వాడా, గుల్బర్గా ప్రాంతంలో జరిగేవి. అలాగే నిజాం సంస్థానంలో పాఠశాలల్లో తెలుగు భోదించేవారు కాదు. ఉర్దూ లోనే విద్యాభ్యాసం ఉండేది. దీనిపై తెలుగు ప్రజల్లో వ్యతిరేకత ఉండేది. దీని ఆధారంగా కొన్ని సాంస్కృతికో ద్యమాలు కూడా నడిచాయి. అందువల్ల ఈ ప్రభావంతో ముస్లిం రాజు పాలనపోవాలని కోరుకునే ‘సెక్షన్‌’ కూడా ప్రజ ల్లో తప్పకుండా ఉంటారు. కానీ అదే నిజాం వ్యతిరేక పోరా టంలో ప్రధానాంశమని చెప్పటం వాస్తవ విరుద్దమేగాక, ఉద్దే శపూర్వకంగా ఒక అత్యుత్తమ ప్యూడల్‌ వ్యతరేక వర ్గపోరాటా నికి మతం రంగు పులిమే నీచమైన చర్య అవుతుంది.

అంతేగాక నిజాం ప్రభుత్వ పతనం తర్వాత కొన్ని చోట్ల మతకలహాలు జరిగాయి. నెహ్రూప్రభుత్వం వీటి విచారణకు సుందర్‌లాల్‌ కమిషన్‌ను నియమించింది. ఈ రిపోర్టు 1948 లోనే ప్రభుత్వానికి చేరినా దానిని 2013దాకా బయటపెట్ట లేదు. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం ఆ ఘర్షణలలో సుమారు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘర్షణలు ప్రధానంగా ఉస్మానాబాద్‌, గుల్బార్గా, బీదర్‌, నాందేడ్‌ నాలుగు జిల్లాల్లోనే 18వేల మంది చనిపోయారు. ఇవిగాక ఔరంగా బాద్‌, బీర్‌ జిల్లాల్లో కూడా ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ కూడా తెలంగాణా పోరాటం జరిగిన ప్రాంతాలు కావు. ఆర్య సమాజ్‌, ముస్లిం కార్యకర్తల మద్య జరిగిన ఘర్షణలే ఈ చావులకు ప్రధాన కారణం. ఈ ఘటనలన్నీ నిజాం పతనం తర్వాత జరిగినవి తప్ప నిజాం కూల్చివేతకు దారితీసినవి కావు. వీటిని చూపి తెలంగాణా సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా బీజేపీ నాయకులు చెప్పటం చరిత్ర వక్రీకరణే. మతమౌడ్యంతో నిండిన మజ్లిస్‌, ఆర్యసమాజ్‌ కార్యకలాపాలు సాయుధ పోరాటానికి ప్రాతినిధ్యం వహించలేవు!

తెలంగాణా సాయుధ పోరాటం అన్ని మతాలు, కులాలకు చెందిన పీడితులు తిరగబడి సాగించిన పోరాటం. పాలకుల్లో ముస్లిం రాజు మాత్రమే కాదు. విసునూర్‌ దేశ్‌ముక్‌, జెన్నారెడ్డి లాంటి వేల ఎకరాల జమీందార్లేకాక, హిందువులుగా ఉన్న అనేకమంది భూస్వాములు నిజాంకు మద్దతుగా ఉన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముగ్దుం మొహియుద్దీన్‌, ఆలం కుందుమురి, షోయబుల్లాఖాన్‌ లాంటి ప్రముఖులు షేక్‌ బందగీ లాంటి సాధారణ ప్రజలనుండి ఉద్భవించిన ముస్లిం విప్లవకారులు ఎందరో ఉన్నారు. పోరాట విరమణ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నిషేధంలో ఉన్నా ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. మొదటి పార్లమెంట్‌లో కమ్యూని స్టులు ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించటానికి తెలంగాణా సాయుధ పోరాట ప్రభావమే ముఖ్య కారణం. తెలంగాణా ప్రాంతంలో పిడిఎఫ్‌ పేరుతో పోటీచేసిన కమ్యూనిస్టు అభ్యర్థులంతా భారీ మెజారిటీలతో గెలుపొందారు.

సాయుధ పోరాట ప్రముఖ నాయకుడు రావి నారాయణరెడ్డి గారికి ఆనాడు ప్రధాని నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీ రావటం దేశమంతటా చర్చనీయాంశమైంది. నేటి బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకుల వాదనలు పనికిమాలినవి అని చెప్పటానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? నాటి మన పూర్వీకులు సాగించిన మహత్తర పోరాట లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు. సెప్టెంబర్‌ 17 రోజుకు నిజాం పాలన ముగిసిన రోజుఅని చెప్పటానికి మించిన ప్రాముఖ్యత ఏమీలేదు. అందుకే ఆ రోజును మనం నిజాం వ్యతిరేక సాయుధ పోరాటాన్ని స్మరించుకునే రోజుగాను పోరాట వీరనారి ఐలమ్మ వర్థంతి రోజు సెప్టెంబరు 10నుండి నిజాం లొంగిపోయిన 17వరకు వారోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ పోరాటం గురించి వివిధ శక్తులు సాగిస్తున్న దుష్ప్రచారాలను తుత్తునియలు చేస్తూనే, భూమి, భుక్తి, సంపూర్ణ రాజకీయ విముక్తి కోసం నాటి అమరుల ఆశయసాధనకు ఈ సందర్భంగా పనరంకితమవుదాం.

తమ్మినేని వీరభద్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -