డెన్మార్క్ షట్లర్‌పై గెలుపు
చైనా మాస్టర్స్ సూపర్ 750
షాంఘై (చైనా) : భారత అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. వరల్డ్ నం.18 పి.వి సింధు మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వరల్డ్ నం.44 జూలి జాకబ్‌సేన్‌పై వరుస గేముల్లో గెలుపొందింది. 27 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో 21-5, 21-10తో సింధు ఏకపక్ష విజయం నమోదు చేసింది. తొలి గేమ్‌లో సింధు దూకుడు చూపించింది. 11-1తో విరామ సమయానికి అదరగొట్టిన సింధు.. ద్వితీయార్థంలో మరో నాలుగు పాయింట్లను మాత్రమే ప్రత్యర్థికి కోల్పోయింది. రెండో గేమ్‌లో జాకబ్‌సేన్ కాస్త మెరుగైన ప్రదర్శన చేసినా.. సింధు దూకుడు తగ్గలేదు. 4-4తో సింధుకు సవాల్ విసిరే ప్రయత్నం చేసిన జాకబ్‌సేన్.. విరామ సమయానికి 7-11తో గట్టి పోటీ ఇచ్చింది. విరామం తర్వాత సింధు టాప్ గేర్‌లో పాయింట్లు సాధించింది. 21-10తో రెండో గేమ్‌ను అలవోకగా నెగ్గింది. నేడు రౌండ్ ఆఫ్ 16లో థారులాండ్ స్టార్, ఆరో సీడ్ పొర్నపవీ చొచువాంగ్‌తో సింధు తలపడనుంది.
పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 19-21, 21-12, 16-21తో మూడు గేముల మ్యాచ్‌లో పోరాడి ఓడాడు.
వరల్డ్ నం.5, చైనీస్ తైపీ షట్లర్ చో చెన్‌కు ఆయుష్ గట్టి పోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌లో 19-20తో ఆఖరు వరకు రేసులో నిలిచిన ఆయుష్.. రెండో గేమ్‌లో సత్తా చాటాడు. 11-6తో విరామ సమయానికి ముందంజ వేసిన ఆయుష్.. అదే జోరు ద్వితీయార్థంలోనూ కొనసాగించాడు. 21-12తో రెండో గేమ్ గెల్చుకుని మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 11-10తో ముందంజ వేసిన ఆయుష్.. ఆధిక్యం ఎంతో నిలుపుకోలేదు. 13-13తో స్కోరు సమం చేసిన చో చెన్ మళ్లీ చిక్కలేదు. వరుస పాయింట్లతో 21-16తో మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను ఎగరేసుకుపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రుత్విక శివాని జంట పరాజయం పాలైంది. జపాన్ షట్లర్లు షిమోగాని, సయాకలు 21-17, 21-11తో వరుస గేముల్లో రోహన్, శివానిలపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్‌లు తొలి రౌండ్ మ్యాచుల్లో నేడు బరిలోకి దిగనున్నారు.