ఐక్యంగా పోరాడితే పాలకులు వినాల్సిందే
మహిళలకు ఆ శక్తి ఉంది : రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతాసిన్హా
జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్‌లో ఐద్వా 14వ జాతీయ మహాసభ : జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర్‌రామన్ వెల్లడి
మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింస, దౌర్జన్యాలు : జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సభలు నిర్వహిస్తాం : మల్లులక్ష్మి
జాతీయ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు
చైర్‌పర్సన్‌గా శాంతాసిన్హా, గౌరవ అధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హక్కుల సాధనే లక్ష్యంగా పోరాటాలు నిర్వహిస్తూనే ఉండాలని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతిసిన్హా చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ మహాసభల కోసం ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాంతాసిన్హా మాట్లాడుతూ…ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాతబడిపోయిందనీ, ఇప్పుడు మహిళ బయట గెలిస్తేనే ఇంట్లో కూడా గౌరవం పెరుగుతుందని నొక్కి చెప్పారు. ఇంటి నుంచే సమానత్వం మొదలు కావాలని ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాలను గుర్తించాలని సూచించారు. ఆ అంశాలపై నిరంతరాయంగా ఉద్యమాలు నిర్వహించాలని సూచించారు. పితృస్వామిక భావాజాలం నుంచి బయటపడాలన్నారు. మహిళలకు ఈ మాత్రం హక్కులు ఉన్నాయంటే..పోరాడితే వచ్చినవేనని గుర్తు చేశారు. వాటి అమలు కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఏర్పడిందని చెప్పారు.. విద్య, ఉపాధి, సామాజిక న్యాయం దక్కినప్పుడే..సమాజం అభివృద్ధి జరిగినట్టని చెప్పారు. మహిళా సాధికారత కోసం మహాసభల్లో తగిన నిర్ణయాలు చేయాలన్నారు. సభల విజయవంతం కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు.
మనుధర్మం మహిళా హక్కులకు వ్యతిరేకం
మనుధర్మం మహిళా హక్కులకు వ్యతిరేకమని ఐద్వా జాతీయ ఉపాద్యాక్షులు సుధా సుందర్‌రామన్ చెప్పారు. రోజురోజుకు మహిళలపై, బాలికలపై హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలున్నప్పటికీ అవి సరిగా అమలు కావడం లేదని చెప్పారు. పాలకులు నేరస్తులకు కొమ్ముకాస్తున్న ఉదంతాలను అనేకం చూస్తున్నామన్నారు. ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేస్తే..నేరాలు తగ్గే అవకాశముందని తెలిపారు. మహిళా వ్యతిరేక మనుధర్మాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్న హక్కుల్లో ఓటు హక్కు మాత్రమే అమలవుతున్నదనీ, ఇప్పుడు బీహార్‌లో 62లక్షల ఓట్లను రకరకాల కొర్రీలు పెట్టి తొలగించారని చెప్పారు. అందులో మహిళల ఓట్లే ఎక్కువని తెలిపారు. రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థలను తమ రాజకీయ ప్రజయోజనాలకు వాడుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. ఐద్వా జాతీయ 14వ మహాసభలు ఎంతో పోరాట చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రంలో జరగటం స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి మాట్లాడుతూ సమాజంలో అనాదిగా మహిళలపై చులకన భావం ఉందన్నారు. మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీజేపీ పాలకులు కుల, మత బేధాలను పెంచి పోషిస్తుండటంతో కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ 2026 జనవరి 25నుంచి 28వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా పోరాటాల ఫలితంగానే ఆస్తి హక్కు చట్టం, వరకట్నం నిషేదిత చట్టం, గహ హింస నిరోధక చట్టం 498 ఎ, స్థానిక సంస్థలో 50శాతం రిజర్వేషన్లు పోరాటాల ద్వారానే సాధించుకున్నామని చెప్పారు. అనేక చట్టాలున్నా వేధింపులు, దౌర్జన్యాలు, గృహహింస జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సమానత్వ సాధన కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజావ్యతిరేక, మహిళా వ్యతిరేక ప్రభుత్వాలున్నాయనీ, పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్మైలాబ్ బాబు, ఐద్వా సీనియర్ నాయకురాలు జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.ఎన్. ఆశాలత, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు బుగ్గవీటి సరళ, పి. ప్రభావతి, బి. పద్మ, ఎమ్. జ్యోతి, కె. గీతరాణి, ఎ. మహేశ్వరి, బి. అనూరాధ, ఎమ్రే షబానా, ఎమ్. వినోధ, వై. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహాసభల ఆహ్వాన సంఘ ఏర్పాటు
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ జాతీయ మహాసభ నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. 75 మందితో ఆహ్వాన సంఘం ఏర్పడింది. చైర్‌పర్సన్‌గా డాక్టర్ శాంతా సిన్హా, గౌరవాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మల్లు లక్ష్మి, కోశాధికారిగా ఆర్ అరుణజ్యోతి, చీఫ్ ప్యాట్రన్లుగా తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ఆవుల మంజులత, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, ఐద్వా వ్యవస్థాపకులు స్వరాజ్యమ్మ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కె నాగేశ్వర్, ఎం రామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, సుద్దాల అశోక్‌తేజ ప్యాట్రన్లుగా ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితోపాటు మరో 11మంది ఎన్నికయ్యారు.
హక్కుల సాధనే లక్ష్యంగా పోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES