Wednesday, September 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకొత్త డిస్కంకు ఓకే

కొత్త డిస్కంకు ఓకే

- Advertisement -

మంత్రివర్గ ఆమోదం తర్వాత అమల్లోకి..
ఆస్తులు, సిబ్బంది విభజన
పీపీఏలు, నిధులు, బకాయిలపై స్పష్టత : ఇంధనశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో మరో నూతన విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మంగళవారం ఇంధనశాఖపై సమీక్ష సందర్భంగా అధికారులు కొత్త డిస్కం ప్రతిపాదనల్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీజీఎస్పీడీసీఎల్‌, టీజీఎన్పీడీసీఎల్‌ సంస్థలు ఉన్నాయి. కొత్త డిస్కం ఏర్పాటుతో వీటి సంఖ్య మూడుకు చేరనుంది. అధికారుల ప్రాథమిక ప్రణాళికల ప్రకారం వ్యవసాయం, మేజర్‌, మైనర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌, గ్రామీణ మంచినీటి సరఫరా, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్‌ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. మూడవ డిస్కంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కేటాయింపులు, ఆస్తులు, బకాయిలు, ఉద్యోగులు, సిబ్బంది విభజన, తదితర అంశాలను సీఎంకు వివరించారు. దీనిపై ఆయన పలు సూచనలు చేశారు. మంత్రివర్గ ఆమోదం తర్వాత కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు ఇచ్చిన ప్రణాళికలపై మరోసారి పునరాలోచన చేసి, మరింత సమర్థవంతమైన ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ఆ తుది ప్రణాళికపై చర్చించాకే మంత్రివర్గ ఆమోదానికి వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని, విద్యుత్‌ కేటాయింపులు జరపాలని సూచించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి, టీజీ జెన్‌కో సీఎమ్‌డీ హరీశ్‌, సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరాం, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ ఫారూఖీ, టీజీఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ వరుణ్‌రెడ్డి, టీజీ రెడ్కో చైర్మెన్‌ శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

కరెంటు, ఇతర కేబుల్స్‌ అండర్‌గ్రౌండ్‌లోనే…
సమీక్ష సందర్భంగా విద్యుత్‌ అధికారులు గ్రేటర్‌ హైదరాబాద్‌లో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ కేబులింగ్‌ విధానంపై ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ పైనా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌తో పాటు కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని సూచించారు. ఓవర్‌ లోడ్‌ సమస్య తలెత్తకుండా లోడ్‌ రీప్లేస్‌మెంట్‌ చర్యలు చేపట్టాలని చెప్పారు. సబ్‌ స్టేషన్‌ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్‌ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ అవసర మైతే అక్కడ సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుకోవాలనీ, దీనికోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. విద్యుత్‌ కేబుల్స్‌తో పాటే ఇతర కేబుల్స్‌ కూడా అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికోసం బెంగుళూరు పాటు ఇతర రాష్ట్రాల్లోని అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే వచ్చే రెండున్నరేండ్లలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ పూర్తి అయ్యేలా ప్రణాళికలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.

‘సోలార్‌’ను ప్రోత్సహించండి
రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఇంధనశాఖ అధికారులు కొండారెడ్డిపల్లిలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మోడల్‌ సోలార్‌ రూఫ్‌టాప్‌ విలేజ్‌ పనుల వివరాలను ఆయనకు వివరించారు. ఇందిరా సోలార్‌ గిరి జల వికాసం ద్వారా రైతులకు సోలార్‌ పంప్‌ సెట్లను అందించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ పంపుసెట్లకు కంటైనర్‌ బేస్డ్‌ సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలనీ, మహిళా రైతులకు సోలార్‌ విద్యుత్‌ అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌, డిగ్రీ కళాశాలు, ప్రభుత్వ భవనాలకు సోలార్‌ విద్యుత్‌ ఏర్పాట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ తయారీలో వీలైనంత ఎక్కువ పెట్టుబడులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -