చరిత్రను వక్రీకరిస్తే చెత్త బుట్టలో కలిసిపోతారు : కవి గాయక సమ్మేళనంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
విప్లవాల గడ్డపై వీరత్వాన్ని గానం చెద్దామని కవి గాయక సమ్మేళనంలో వక్తలు అన్నారు. చరిత్రను వక్రీకరిస్తే చెత్త బుట్టలో కలిసిపోతారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యాదిలో తెలంగాణ సాహితీ, టీపీఎస్‌కే సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమంటే ఎందరో వీరుల నెత్తుటి త్యాగాలతో తడిసిన చరిత్ర అని అన్నారు. సాయుధ పోరాటానికి వక్రీకరణ జరుగుతున్న ఈ తరుణంలో అసలైన చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కవులు కళాకారులపై ఉందని తెలిపారు. తెలంగాణ నేల పోరాటాల గడ్డ అని, ఈ నేలపై గ్రంథాలయ ఉద్యమం ద్వారా ప్రారంభమైన ఉద్యమం ఆంధ్రమహాసభ ద్వారా భాషా సాంస్కృతిక విధానాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉందని తెలియజేసిందని చెప్పారు. బాంఛన్ అన్న నోటితోనే నీ ఘోరీ కడతాం కొడకా అనేలా చేసింది తెలంగాణ నేల అన్నారు. తెలంగాణ ప్రాంతం వారే కాదు.. కలకత్తా నుంచి చిత్త ప్రసాద్ తన చిత్రాలతో, హరేంద్రనాథ్ చటోపాధ్యాయ గీతాలు, ఆంధ్ర నుంచి ఆవంత్స సోమసుందర్, సుంకర, ఆరుద్ర వంటి వారు వారి కావ్యాలతో సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు.
భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటానికి మతం రంగు పులమడం సరైంది కాదన్నారు.
నైజాం కాలంలోనే షోయబుల్లాఖాన్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. మఖ్దూం ఇక్కడే కామ్రేడ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారని, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి సాహిత్యకారులు, సుద్దాల హనుమంతు వంటి వాగ్గేయకారులు ఆ పోరాటంలో ప్రజలను చైతన్యం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ”నేను సైతం వీర తెలంగాణ పోరాట సంస్కృతితో ముందుకెళ్తాను.. నేలకొరిగిన అమరవీరుల సాక్షిగా అనుక్షణం నవతెలంగాణ నిర్మాణానికై పని చేస్తాను. నేను సైతం సమసమాజ స్థాపన ఉద్యమంలో నిండిపోతాను. చరిత్ర వక్రీకరణలు, కల్లబొల్లి కబుర్లు, ఉత్తి మాటలు, ఉట్టెక్కిన ఆశలు, రాజకీయ ఎత్తులు, సాంస్కృతిక దాడులు.. ఇక వద్దు.. నా తండ్రులు ఎదిరించిన నాటి శత్రువే నేటికీ ఈనాడు నీచంగా హీనంగా పీల్చి పిప్పి చేస్తుంటే.. ఇంకానా ఇకపై సాగదు. నేను సైతం వీర తెలంగాణ పోరాట ఆశయాలకు ఊపిరినవుతాను.. భావితరాలకు బాటనవుతాను. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాలకు ఊతమవుతాను” అంటూ కవులు, రచయితలందరూ ప్రతిజ్ఞ చేశారు. సాయుధ పోరాట నిజ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. ఈ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు.. సంఘపరివార్‌కు మతశక్తులకు మాట్లాడే హక్కు లేదని నినాదించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు వనపట్ల సుబ్బయ్య, ప్రముఖ రచయిత సామిడి జగన్‌రెడ్డి, మోహన్ కృష్ణ, ఎంవీ రమణ, సలీమా, బండి సత్తన్న, శరత్ చంద్ర అనుముల ప్రభాకర్, ఉదయగిరి మధుబాబు, గెరా ముజాహిదీన్, రేఖా, సునిత తదితరులు పాల్గొన్నారు.
విప్లవాల గడ్డపై వీరత్వాన్ని గానం చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES