Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్ని ఆస్పత్రులను సందర్శిస్తా

అన్ని ఆస్పత్రులను సందర్శిస్తా

- Advertisement -

సేవలపై రోగులతో మాట్లాడుతా : వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అన్ని హాస్పిటళ్లను నేరుగా సందర్శించి, పేషెంట్లకు అందుతున్న సేవలపై నేరుగా వారితోనే మాట్లాడుతానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ప్రత్యేకంగా 10 అనుబంధ ఆస్పత్రులు ఉస్మానియా మెడికల్‌ కాలేజీకున్నాయని గుర్తుచేశారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు, నిలోఫర్‌ , సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌, టీబీ అండ్‌ చెస్ట్‌ హాస్పిటల్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, సుల్తాన్‌ బజార్‌ మెటర్నిటీ హాస్పిటల్‌, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్‌, ఈఎన్‌టీ హాస్పిటల్‌, ఫీవర్‌ హాస్పిటల్‌ అనుబంధంగా ఉన్నాయన్నారు. వంద సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల రోగుల ప్రాణాలను ఈ హాస్పిటళ్లే నిలిపాయని మంత్రి గుర్తు చేశారు. 5 వేలకుపైగా బెడ్లతో, ఒక్కో హాస్పిటల్‌ ఒక్కో స్పెషాలిటీలో లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు.

వివిధ ప్రత్యేకతలతో ఎంతో ముందు చూపుతో ఏర్పాటైన ఈ హాస్పిటళ్లకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా హాస్పిటళ్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హాస్పిటళ్లను ఆధునీకరించడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌కు మంత్రి సూచించారు. ఈఎన్‌టీ హాస్పిటల్‌ కోసం కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, ఉస్మానియా డెంటల్‌ కాలేజీకి సంబంధించిన భూమి సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఆయా హాస్పిటళ్ల పనితీరు, పేషెంట్లకు అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలు, సమస్యలపై అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్‌, టీవీవీపీ కమిషనర్‌ అజయ్ కుమార్‌, అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -