డిసెంబర్ కల్లా ఉండొచ్చు
మోర్గాన్ స్టాన్లీ అంచనా
ముంబయి : పండుగ సీజన్‌లో మరో రెండు సార్లు వడ్డీ రేట్లలో కోతలు ఉండొచ్చని అంతర్జాతీయ ఎజెన్సీలు అంచనా వేస్తోన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే అక్టోబర్, డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. రెండు దఫాల్లో మొత్తంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టొచ్చని విశ్లేషించింది. ఒక వేళ అదే జరిగితే రుణాలు చౌకగా మారనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 4 శాతం కంటే దిగువన నమోదు కావొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉన్నందున రానున్న రెండు సమీక్షల్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చని విశ్లేషించింది. మరోవైపు జీఎస్టీ శ్లాబుల తగ్గింపునతోనూ ధరలు మరింత దిగిరావొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
గడిచిన ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో రెపోరేటును 0.25శాతం చొప్పున ఆర్బీఐ తగ్గించింది. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. అలా మూడు వరుస సమీక్షల్లో కలిపి రెపోరేటు 1 శాతం తగ్గింది. ట్రంప్ టారిఫ్ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం రెండు విడతల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గితే.. రెపో రేటు 5 శాతానికి తగ్గనుంది.
మరో రెండు సార్లు వడ్డీ కోత..!
- Advertisement -
- Advertisement -