Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంసంక్షోభంలో కార్మికుల సంక్షేమం

సంక్షోభంలో కార్మికుల సంక్షేమం

- Advertisement -

మోడీ ఇలాకాలో ఎవరికీ పట్టని నిర్మాణ కార్మికుల గోడు

అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2006 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ ప్రాజెక్టుల నుంచి సుమారు రూ.4,786.60 కోట్లను సెస్సు రూపంలో వసూలు చేసినప్పటికీ ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, సంక్షేమం కోసం పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విఫలమైందని కాగ్‌ ఎత్తిచూపింది. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పడిన కీలక బోర్డు పనిచేయడం లేదు. వేలాది పోస్టులు ఖాళీగా పడివున్నాయి. కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులలో 47 శాతం వివిధ ప్రభుత్వ ఖాతాలలో మూలుగుతున్నాయి. 2022 మార్చితో అంతమైన కాలానికి సంబంధించి భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై కాగ్‌ తన నివేదికను గత బుధవారం రాష్ట్ర శాసనసభ ముందు ఉంచింది. నిర్మాణ కార్మికుల ప్రయోజనాల కోసం 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా సంక్షేమ బోర్డును, సలహా కమిటీని, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం, సంస్థాగత వైఫల్యం కారణంగా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.

సంక్షేమ బోర్డులో ప్రభుత్వం, యాజమాన్యాలు, కార్మికులకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. కానీ 2017 నవంబర్‌ నుంచి బోర్డు ఒకే ఒక సభ్యుడితో నడుస్తోంది. అది కూడా కార్మిక శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి నాయకత్వంలో. బోర్డులో కార్మికులు, యాజమాన్య ప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో వేలాది మంది కార్మికుల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక రాష్ట్ర సలహా మండలిని 2011 నుంచి ఏర్పాటు చేయనేలేదు. పరిపాలన కుప్పకూలిపోయిందని చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. సలహా మండలి అంటూ లేకపోవడంతో భద్రత, సంక్షేమ పథకాలు, నిధుల వినియోగం వంటి ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే వారే కరువయ్యారు. ఇక సంక్షేమ నిధి విషయానికి వస్తే ఇప్పటి వరకూ దాని ఊసే లేదు. నిధిని ఏర్పాటు చేయకపోవడంతో వసూలు చేస్తున్న సెస్సును ఓ ప్రభుత్వ ఖాతాలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా అరకొర గ్రాంట్ల పైనే బోర్డు ఆధారపడాల్సి వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -