హైకోర్టు
నవతెలంగాణ -హైదరాబాద్
కొండలు, గుట్టలు, రాళ్ల తొలగింపునకు జరిపే పేలుళ్ల తీరుపై స్పష్టతివ్వాలని పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అనుమతులు సిటీ పోలీస్ కమిషనర్ ఇస్తారని చెబితే చాలదనీ, పేలుళ్లు నిర్వహించడానికి ఎన్వోసీని ఏ ప్రాతిపదికన ఇస్తారో చెప్పాలంది. ఈ మేరకు సిటీ పోలీసు కమిషనర్‌కు మంగళవారం ఆదేశాలిచ్చింది. ఇతర శాఖల నుంచి వివరాలు తెప్పించి పరిశీలన చేసేదీ, లేనిదీ కూడా వివరించాలంది. పేలుళ్లకు అనుసరించే ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ఆదేశించింది. విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ న్యాయవిహార్ వెనుక భాగంలో రాత్రిళ్లు పేలుళ్లు చేయడంపై సుమోటో పిల్‌ను (జడ్జి రాసిన లేఖ ఆధారంగా) చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ బెంచ్ మంగళవారం విచారించింది. పోలీస్ కమిషనర్ ప్రతివాదిగా లేరని ప్రభుత్వం చెప్పడంతో ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది.
రిటైర్డు ఐఏఎస్ జోషికి ఊరట : హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషికి హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్‌లోని సిఫారసుల ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జోషి వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ బెంచ్ మంగళవారం విచారించింది. కమిషన్ రిపోర్ట్ అన్‌లైన్‌లో ఉందని పిటిషనర్ లాయర్ చెప్పారు. ట్విట్టర్‌లోనూ ఉందన్నారు. సాక్షిగా కమిషన్ పిలిచి అభియోగాలు మోపిందనీ, ఇలా చేసే ముందు సెక్షన్ 8(బి), 8(సి) కింద నోటీసు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎవరిపైనా చర్యలు తీసుకోదనీ, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రం ఆదేశించిందని చెప్పారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది.
వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ కావడంపై పిటిషన్
ఎమ్మెల్సీగా పి.వెంకట్రామిరెడ్డి ఎంపిక తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానికి నెంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ బెంచ్ తోసిపుచ్చింది. నెంబరు కేటాయించాలని ఆదేశించింది. ‘ఐఏఎస్ పదవికి రాజీనామాను కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం చెల్లదు. ఎమ్మెల్సీ పదవిపై అనర్హులు. ఈ మేరకు ఈసీకి, మండలి చైర్మన్‌కు ఆదేశాలివ్వాలి’ అని కరీంనగర్‌కు చెందిన జె.శంకర్, ఇతరులు పిటిషన్లు వేశారు. ‘ఆయన రాజీనామాను సీఎం ఒత్తిడితో సీఎస్ ఆమోదించారు. నిజానికి కేంద్రం ఆమోదం చెప్పాలి. నోటీసు ఇచ్చాక గడువు తీసుకున్నాక కేంద్రం ఆమోదించాలి. ఇవేమీ చేయకుండా రాష్ట్రం ఆమోదించడం చెల్లదు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పిటిషనర్‌కు రూ.20 వేల జరిమానా
సింగరేణి కాలరీస్ డైరెక్టర్‌గా బలరాం కొనసాగే అర్హత లేదని పిటిషన్ వేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.20 వేల జరిమానా విధించింది. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్, ఇన్‌ఛార్జి సీఎండీ బలరాం ఉన్నారు. డైరెక్టర్‌గా కొనసాగే అర్హత లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సంపత్‌కుమార్ పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. సింగరేణి కంపెనీలో పనిచేసి తొలగింపునకు గురయ్యారనీ, 18 కేసులున్నాయనీ, ఇదే తరహా కేసులో హైకోర్టు గతంలో రూ.50 వేలు జరిమానా విధించిందని గుర్తు చేశారు. రూ.20 వేలు జరిమానా విధించి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.
స్థానికతపై స్పష్టత ఇవ్వండి : హైకోర్టు
ఏపీలోని కోరుకొండ సైనిక్ పాఠశాలలో చదివిన తెలంగాణకు చెందిన విద్యార్థికి మెడికల్ సీట్ల కేటాయింపు విషయంలో స్థానికతపై వివరణ ఇవ్వాలని కాళోజీ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ‘పిటిషనర్ ఎనిమిదో తరగతి వరకు తెలంగాణలో చదివాడు. తెలంగాణ కోటాలో సైనిక్ స్కూల్‌లో 9, 10, ఇంటర్ చదివాడు. ఇప్పుడు మెడికల్ సీటుకు స్థానికుడు కాదని అంటున్నారు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై బుధవారం వివరణ ఇవ్వాలని వర్సిటీని సీజే బెంచ్ ఆదేశించింది.
మెడికల్ సీటు ఇవ్వండి
ఐఆర్‌ఎస్ అధికారిగా కోల్‌కతాకు బదిలీపై వెళ్లడంతో ఇక్కడ మెడికల్ అడ్మిషన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఎం.సిద్ధార్థ్ మను అనే విద్యార్థి వేసిన పిటిషన్‌లో సీజే బెంచ్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషనర్ సమర్పించిన అన్ని పత్రాలను పరిశీలించి స్థానిక కోటా కింద అడ్మిషన్‌పై నిబంధనల ప్రకారం ఇవ్వాలంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.
పేలుళ్ల అనుమతిపై స్పష్టతివ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES