Thursday, September 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజియూరియా కష్టాల్లో అన్నదాత

యూరియా కష్టాల్లో అన్నదాత

- Advertisement -

పంటకాలం పూర్తికావస్తున్నా తగినంత యూరియా అందడంలేదనే ఆవేదన సగటు రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతును కదిలించినా యూరియా కష్టాలు వర్ణనాతీతంగా ఒలకబోస్తున్న పరిస్థితి కాదనలేని వాస్తవం. పంటలకు సకాలంలో యూరియా వేస్తేనే మంచి దిగుబడి వస్తుంది. అదును దాటితే దిగుబడి కోల్పోయే ప్రమాదముంటుందనేది తెలిసిందే. సరైన ఈ సమయంలో ఎరువు దొరకక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో ఒకరకంగా యూరియా యుద్ధాలు జరుగుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో ఏమాత్రం పరిశీలించినా అర్థమవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఈ వానాకాలం సాగు 1.27 కోట్ల ఎకరాలకు చేరింది. ఈ సీజన్‌లో సాధారణ సాగులక్ష్యం 1.34కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 96శాతం లక్ష్యం సాధించిందని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్‌లో సాగైన పంటల్లో వరి 62.27 లక్షల ఎకరాలతో అగ్రస్థానంలో నిలిచినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఆ తరువాత పత్తి వంట 45.47 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో ఉంది.

అయితే ఈ ఖరీఫ్‌ సేద్యానికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్రం 9.8లక్షల యూరియా కేటాయించింది. ఈ ఖరీఫ్‌ ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.32 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 5.12 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. అలాగే ఏప్రిల్‌ 1.70 లక్షల టన్నులు, మే 1.60 లక్షలు, జూన్‌లో 1.70లక్షలు, జులైలో 1.60లక్షలు, ఆగస్టులో 1.70 లక్షల టన్నులు మాత్రమే వచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీనుంచి రాష్ట్రానికి అత్యధిక శాతం యూరియా రావాల్సి ఉన్నప్పటికీ అందుకనుగుణంగా ఉత్పత్తి గానీ, సరఫరా గానీ జరుగలేదని ఇందుకు రామగుండం ఫ్యాక్టరీ సక్రమంగా పనిచేయక పోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇక యూరియా సరఫరా సకాలంలో లేకపోవడం వల్ల పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత కారణంగా పత్తి, వరి దిగుబడి 20 నుంచి 30 శాతం తగ్గే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూరియా కొరత ఇలాగే కొనసాగితే దిగుబడులు సుమారు 40 శాతం తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్తున్నారు. ఈ రెండు పంటలకు సకాలంలో యూరియా వేస్తే పంట ఏపుగా పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది. లేదంటే సమస్యలు తప్పవని రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

సకాలంలో వంటలకు అవసరమైన యూరియా లభ్యం కాక అన్నదాతల పరిస్థితి ఇప్పటికీ దయనీయగా ఉంది. కొన్నిచోట్ల ఒక్కో బస్తా, రెండేసి బస్తాలు యూరియా సరఫరా చేస్తున్నా, అది సాగు చేసిన పంటలకు సరిపోక రైతుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. యూరియా కోసం సహకార సంఘాలు, ఫెర్టిలైజర్‌ షావులు, ఇతర విక్రయ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం యుద్దాలు చేయాల్సినంత పరిస్థితులు దాపురిస్తున్నాయని క్షేత్రస్థాయి రైతుల్లో అవేదన నెలకొంది. ఈ స్థితికి పాలకులు ముందస్తు ప్రణాళికలు రూపొందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైఖరి, సంబంధించిన వ్యవసాయశాఖ అలసత్వమే కారణమంటే కాదనే పరిస్థితి లేదు. ఇక కొన్ని జిల్లాల్లో యూరియా కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి యూరియా కొరత అధికారులు చెప్తున్నదానికి భిన్నంగా ఉందనేది గమనించాల్సి అంశం. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని, రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని రాష్ట్రాధినేతలు కేంద్ర ఎరువుల శాఖను కోరగా సానుకూలంగా స్పందించి యూరియా కొరతను తీర్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే ఇవి ప్రకటనలు, విన్నపాల వరకు మాత్రమే పరిమితం అయితే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. నష్టాలు తప్ప. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతుల యూరియా కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లనే ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడిందనే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దామెర రాజేందర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -