– నేటి తరానికి పెరియార్ ఆదర్శం
– SSF ఆధ్వర్యంలో పెరియార్ 146వ జయంతి వేడుకలు.
నవతెలంగాణ – కాకతీయ యూనివర్సిటీ, వరంగల్: సమాజంలో శాస్త్రీయ దృక్పథం, కుల నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం, స్వాభిమానం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు పెరియార్ 146వ జయంతి వేడుకలు కాకతీయ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ విభాగంలోని సెమినార్ హాల్లో శాస్త్రీయ అధ్యయన వేదిక – సైంటిఫిక్ స్టడీ ఫోరమ్ (SSF) కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ అమర్ నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
అమర్ నాథ్ అధ్యక్షతన పెరియార్ జయంతి సభలో వక్తలు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు పొలిటికల్ సైన్స్ హెచ్.ఓ.డి. సాకినేని వెంకటయ్య, హిస్టరీ హెచ్.ఓ.డి.. చిలివేరు రాజ్ కుమార్, తెలుగు విభాగం హెచ్.ఓ.డి. మామిడి లింగయ్య, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ చిర్రా రాజు గౌడ్ మాట్లాడారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ..పెరియార్ జీవితం సమాజానికి మార్గదర్శకం, స్త్రీ విద్య, స్త్రీ పురుష సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన శాస్త్రీయ సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. స్వాభిమాన ఉద్యమాన్ని మొదలుపెట్టి నేటికి సరిగ్గా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా పెరియార్ జయంతి యూనివర్సిటీలో నిర్వహించడం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. పెరియార్ నడిపిన ద్రవిడ ఉద్యమం, స్వాభిమాన ఉద్యమం సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయని , రాజకీయం లో సైతం అణగారిన కులాలకు రాజ్యాధికారం దక్కడానికి కృషి చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చార్వాక, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్ మాట్లాడుతూ “సమాజంలో నిజమైన స్వేచ్ఛ, సమానత్వం సాధించాలంటే పెరియార్ చూపిన మార్గమే శాశ్వత మార్గదర్శకం” అని నొక్కిచెప్పారు. సమాజంలో మూఢనమ్మకాలు నిర్మూలించి శాస్త్రీయ సమ సమాజాన్ని స్థాపించడం ద్వారానే మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు కుల మతాలకు అతీతంగా మహనీయుల బాటలో నడవాలని సమాజ మార్పుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు గుత్తి కొండ చక్రధర్, కుమ్మరి రమేశ్, కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ అమర్ నాథ్, కో కన్వీనర్ శర్మ, సాంబ రాజు, కమిటీ సభ్యులు పున్నం,అనిల్, జునైద్ మరియు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
