ఆగస్టులో అమెరికాకు తగ్గిన ఎగుమతులు
మూడు నెలలుగా నేల చూపులు
సెప్టెంబర్‌లో మరింత తీవ్రం..!
ఫలించని ఆరోవిడత ద్వైపాక్షిక చర్చలు
మోడీకి ట్రంప్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
స్వదేశీ వస్తువులనే కొనండి : మారిన మోడీ స్వరం
నిన్నా మొన్నటి వరకు తన మిత్రుడైన ట్రంప్‌పై మోడీ పెట్టుకున్న ఆశలు ఫలితమివ్వడం లేదని స్పష్టమవుతోంది. భారత్..యూఎస్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భేటీ జరిగిన.. స్వల్ప వ్యవధిలోనే స్వదేశీ వస్తువులే కొనాలంటూ ప్రధాని మోడీ అభ్యర్థించటం చూస్తుంటే.. ట్రంప్ నుంచి డోంట్‌కేర్ అన్న సంకేతాలు వస్తున్నాయని అర్థమవుతోంది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ప్రధాని మోడీ స్వదేశీ నినాదాన్ని భుజాన కెత్తుకున్నారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్‌లు భారత ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల ధరలు అక్కడ భారీగా పెరగడంతో మన ఎగుమతులు పడిపోయాయి. గడిచిన ఆగస్టు నెలలో అమెరికాకు ఎగుమతులు 16.3 శాతం పతనమై 6.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. భారత్‌పై ట్రంప్ ఏకంగా 50శాతం టారిఫ్‌లు విధించడంతో ఎగుమతులు అమాంతం పడి పోతున్నాయి. దీంతో వరుసగా మూడో మాసం లోనూ ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్ల య్యింది. ఇంతక్రితం జులై ఎగుమతుల్లో 3.6 శాతం, జూన్‌లో 5.7 శాతం చొప్పున క్షీణించాయి. చివరి సారిగా అమెరికాకు భారత ఎగుమతులు మే నెలలో 4.8 శాతం పెరిగి 8.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ట్రంప్ టారిఫ్‌ల వల్ల అమెరికా మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో మన ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని థింక్‌టాంక్ సంస్థ జీటీఆర్‌ఐ వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి భారత్‌పై అమెరికా 25 శాతం టారిఫ్‌ను విధించగా.. ఆ తర్వాత 27 నుంచి దానిని 50 శాతానికి పెంచింది. ఇందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపింది. భారీగా టారిఫ్‌ల పెంపు ఎగుమతుల పతనానికి కారణమని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకులు అజరు శ్రీవాస్తవ తెలిపారు. గత మూడు నెలల పరిణామాలు, గణాంకాలను పరిశీలిస్తే సెప్టెంబర్ లో ఎగుమతుల పతనం తీవ్రంగా ఉండొచ్చని విశ్లేషించారు. ఈ నెలలోనే పూర్తిస్థాయిలో టారిఫ్‌ల దెబ్బ తీవ్రత తెలుస్తుందని అన్నారు. భారత వస్త్రాలు, ఆభరణాలు, తోలు, రొయ్యలు , కార్పెట్‌లు వంటి రంగాలపై ట్రంప్ భారీగా సుంకాలను విధించిన విషయం తెలిసిందే. 2026 ఆర్థిక సంవత్సరం చివరి వరకు 50 శాతం సుంకాలు కొనసాగితే భారత్ నుంచి యూఎస్ ఎగుమతుల్లో 30-35 బిలియన్ డాలర్లను కోల్పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారత వాణిజ్య లోటును తీవ్రంగా పెంచొచ్చని విశ్లేషిస్తున్నారు. భారత మొత్తం ఎగుమతుల్లో 20 శాతం అమెరికాకే వెళ్తున్నాయి.
స్వదేశీ వస్తువులనే కొనండి : మారిన మోడీ స్వరం
”ఇది పండుగల కాలం.. ఈ సమయంలో, మనం స్వదేశీ మంత్రాన్ని గుర్తుంచుకోవాలి. దానిని మన జీవితాల్లో చేర్చుకోవాలి. నా 140కోట్ల మంది భారతీయులను వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా. మీరు ఏది కొన్నా, అది మన దేశంలోనే తయారు చేయాలి” అని మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో దేశంలో మొట్టమొదటి పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలనీ , అలాగే దేశీయంగా తయారు చేసిన వస్తువులను విక్రయించాలని వ్యాపారులను కోరారు. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్వల్పవ్యవధిలో మోడీ నోట స్వదేశీ నివాదం తెరపైకి రావటం చర్చనీయాంశమైంది.