రేవంత్ ఓ నియంత
నాపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టారు
కుడితిలోపడ్డ ఎలుకల్లాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘బాస్ సరైన సమయంలో బయటకొస్తారు…’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తన తండ్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. జనంలోకి ఎప్పుడు రావాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎం రేవంత్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, కనీసం తన మంత్రివర్గ సహచరులకు కూడా తెలియకుండా ఆయన కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య బలమైన బంధం కొనసాగుతోందనటానికి కాళేశ్వరం కేసే ఒక ఉదాహరణని తెలిపారు. మంచి బ్యాట్స్‌మెన్ అయిన అజారుద్దీన్‌ను కూడా సీఎం పక్కదోవపట్టించారని అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అజహర్ త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారని పేర్కొన్నారు. తమ పార్టీలో బంధుప్రీతి లేదని చెబుతున్న రేవంత్… సుజన్‌రెడ్డి, అమిత్ రెడ్డికి వందల కోట్ల కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఏడు సర్వేలు చేయిస్తే.. ఏడింటిలోనూ గులాబీ జెండాదే విజయమని తేలిందన్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్ నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే విషయం తేటతెల్లమైందని అన్నారు. ఆర్.ఆర్.ఆర్.కు సంబంధించి భారీ కుంభకోణం చోటు చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. సీఎంకు దగ్గరి బంధువుల కోసమే దక్షిణ భాగంలో అలైన్‌మెంట్‌ను మారుస్తున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల నష్టపోయిన గ్రూప్-1 అభ్యర్థుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీసం మీటింగు పెట్టుకునే అవకాశం కూడా ఇవ్వటం లేదని వాపోయారు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతోందనీ, తనపై కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టేందుకు కుట్రలు పన్నిందని దుయ్యబట్టారు. అక్కడి చేనేత పరిశ్రమను అస్తవ్యస్తం చేసిందని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రజా పాలన అద్భుతంగా ఉందంటూ జబ్బలు చరుచుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌కు నిజంగా ధైర్యముంటే…పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించి, వెంటనే ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
బాస్ సరైన సమయంలో బయటకొస్తారు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES