Thursday, September 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు

మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు

- Advertisement -

సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టులదే
ఐలమ్మ గ్రామాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సందర్శించాలి
నైజాం, మోడీ దొందూ దొందే
సామాజిక అణచివేత, వర్గ దోపిడీపై జమిలి ఉద్యమం
నల్లగొండ, సూర్యాపేటల్లో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభల్లో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు బృందాకరత్‌
ఆనాటి పోరాట యోధులకు సన్మానం

నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/సూర్యాపేట
”కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏం సంబంధం..? మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేదు..” అని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు, పార్లమెంటు మాజీ సభ్యురాలు బృందాకరత్‌ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండ, సూర్యాపేటల్లో సీపీఐ(ఎం) జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భారీ సభలు జరిగాయి. ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్యవక్తగా బృందాకరత్‌ హాజరై మాట్లాడారు. నల్లగొండలో జరిగిన సభకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షత వహించారు. ”తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- వాస్తవాలు -వక్రీకరణలు’ అనే అంశంపై సూర్యాపేటలో నిర్వహించిన సెమినార్‌కు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.నల్లగొండ సభలో బృందాకరత్‌ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆపాలని హితవు పలికారు.

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే హైదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17న ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైందన్నారు. సంవత్సరం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వీర తెలంగాణ పోరాటాన్ని ముస్లింరాజు, హిందువులకు మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోందన్నారు. దేశంలో జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ విలీనం అయిందని.. అక్కడ రాజు హరిసింగ్‌ హిందువు, ప్రజలు ముస్లింలని మరి అక్కడ ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లింలు, హిందువులు, సిక్కులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని గుర్తుచేశారు. విముక్తి గురించి బీజేపీకి ఏమి తెలుసునని, విముక్తి అంటే 3000 గ్రామాలలో రైతులు, కూలీలు అన్ని వర్గాలు ఎర్రజెండా నీడలో పరుగెత్తి ఆనాటి రాజు, జమీందారులలపై పోరాటం చేసి తెలంగాణకు విముక్తి కల్పించారని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చిట్యాల ఐలమ్మ జన్మించిన గ్రామాన్ని సందర్శించాలని సూచించారు. ప్రజల తిరుగుబాటుతో నిజాం భయపడిన తర్వాతనే ఇండియన్‌ ఆర్మీకి లొంగిపోయాడన్నారు. ఎర్రజెండా నీడలో రాబోయే రోజుల్లో ప్రజలు మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సూర్యాపేటలో నిర్వహించిన సెమినార్‌లో బృందాకరత్‌ మాట్లాడుతూ.. 1946 సెప్టెంబర్‌ 11 నుంచి 1951 సెప్టెంబర్‌ 17 వరకు జరిగిన విరోచిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు ఇప్పుడు ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 1913లో హిందూ మహాసభ.. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌, 1951లో జనసంఘ్‌ ఏర్పడితే వీరు ఎందుకు ఆ పోరాటంలో పాల్గొనలేదని ప్రశ్నించారు. నాడు ప్రజలు తెలుగు మాట్లాడకూడదు..ఉర్దూ మాత్రమే ఉండాలని నైజాం చెప్పిన్నట్టుగానే, నేడు బీజేపీ హిందీ మాత్రమే మాట్లాడాలని మాతృభాష మాట్లాడొద్దంటోందని విమర్శించారు. నైజాం, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. విసునూర్‌ రామచంద్రారెడ్డిది ఏ మతమని ప్రశ్నించారు. దోపిడీదారులు, దోపిడీకి గురైన పేదలు కూడా హిందువులేనని చెప్పారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటే రైతాంగ సాయుధ పోరాటమని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల పోరాట వారసత్వాన్ని ఈ తరానికి అందించకుండా దానికి మతం రంగు పులిమి యువతరాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పారేపల్లి వెంకయ్య, కలగాని సోమయ్య, దండిగా రాములు, కృష్ణమూర్తి, బాబు సాహెబ్‌, గంట రాఘవరెడ్డి, నాతి సోమక్కను ఘనంగా సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -