Wednesday, October 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపికెట్‌ పార్కులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

పికెట్‌ పార్కులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

- Advertisement -

– రిమోట్‌ ద్వారా ఆవిష్కరించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ పికెట్‌ పార్కులో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆవిష్కరించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ రిమోట్‌ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి, ఇతర మంత్రులకు కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్‌ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షేకావత్‌, జి.కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధు కర్‌ నాయక్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

పికెట్‌ వద్ద భారీ బందోబస్తు.. మీడియాకు నో ఎంట్రీ
కేంద్ర మంత్రి రాక సందర్భంగా పోలీసులు పికెట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియా సహా సాధారణ నాయకులను లోపలికి అనుమతించలేదు. కేవలం వీఐపీలకే ప్రవేశం కల్పించారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ తన అనుచరులతో కలిసి రాగా.. పోలీసులు ఆపేశారు. ఎమ్మెల్యే లోపలికి వెళ్లగా.. ఆయన అనుచరులు వెనుదిరిగారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన
పలు సమస్యలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నాయకులు, కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సభ్యులు నళిని వెంకట్రావు, అనిత ప్రభాకర్‌, పాండు యాదవ్‌ తదితరులు అక్కడకు చేరుకోగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దాంతో కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వాజ్‌పేయి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బోర్డు సీఈవో మధుకర్‌ నాయక్‌ను నిలదీశారు. అందుకు ఆయన క్షమాపణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -