దానికి గతం తెలియదు…అందుకే చరిత్రను వక్రీకరిస్తున్నారు
గాంధీని హత్య చేసిన గాడ్సేనే వారికి దేవుడు
వారికి దేశభక్తి కంటే అధికార భక్తే ఎక్కువ
నెహ్రూ ఆదేశాలతో పటేల్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ పోలో’
కుమురంభీమ్, దొడ్డి కొమురయ్య
వీరనారి ఐలమ్మ, షేక్‌బందగి వంటి కమ్యూనిస్టు యోధులను స్మరించుకోవాలి : తెలంగాణ విలీన దినోత్సవంలో మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల చరిత్ర బీజేపీ నేతలకు తెలియదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. అది మోడీ, అమిత్‌షాల బీజేపీ, అందుకే వారు గత చరిత్రను తెలుసుకోరని ఎద్దేవా చేశారు. అజ్ఞానంతోనే తెలంగాణ పోరాటాల చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మహాత్మగాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే వారికి దేవుడని చెప్పారు. వారికి దేశభక్తి కంటే అధికార భక్తి ఎక్కువ అని విమర్శించారు. జవహర్‌లాల్ నెహ్రు ఆదేశాలతో సర్ధార్ వల్లభారు పటేల్ నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసినట్టు గుర్తు చేశారు. అది ముమ్మటికీ విలీనమేనని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన తెలంగాణ విలీన దితన్సోవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరముందని చెప్పారు. అందుకోసం రామనంద తీర్థ, జమాలపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహరావు వంటి మహనీయులను గుర్తు చేసుకోవాలన్నారు. నిజాం వ్యతిరేకంగా పోరాడిన కుమురంభీమ్, దొడ్డి కొమురయ్య, వీరనారి ఐలమ్మ, షేక్ బందగి, కమ్యూనిస్టు యోధులను స్మరించుకోవడమనేది ప్రతి తెలంగాణ వాసి బాధ్యత అని చెప్పారు.
1980లో ఆవిర్భావించిన బీజేపీకి…దేశ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ విలీన పోరాటాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. గాంధీని గౌరవించకుండా ఆయన్ను హత్య చేసిన గాడ్సేను పూజించడం అది దేశ భక్తి కాదని స్పష్టం చేశారు. దేశంలో మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ…తెలంగాణ ప్రాంత విలీనాన్ని ‘విమోచన’గా పిలుస్తూ పటేల్‌ను అవమానిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని లొంగదీసుకుని మూడోసారి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారని తెలిపారు.ఆ పార్టీ ఓటు దోపిడీతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నడిపిస్తున్న ‘ఓటు చోరీ ఉద్యమం’ బీజేపీ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నదని చెప్పారు. స్వాతంత్య్రం కోసం ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. సోనియా, రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమున్నా ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను రెండు సార్లు ప్రధానిని చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతమైన ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం నుంచి సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్టు
మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాల్‌లో మదర్ ఫౌండేషన్ చైర్మెన్ బొజ్జ సంద్యారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వెనకబడిన తరగతుల మహిళల సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళ సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగెం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.