నిరుద్యోగుల పక్షాన పోరాడి, కేటీఆర్, జాన్సన్ నాయక్ ల అభినందనలు అందుకున్న సాయిని ప్రసాద్ నేత..
నవతెలంగాణ – జన్నారం
గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు భాగంగా జరిగిన అవకతవకలను ఖండిస్తూ అక్రమ అరెస్టు కాబడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన యువ నాయకులు, నేతకాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ బుక్య జాన్సన్ నాయక్ అభినందించారు.
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలను చర్చించుటకు అఖిలపక్ష విద్యార్థి సంఘాలుగా, నిరుద్యోగులుగా ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్న సందర్భంలో ప్రసాద్ నేతను ఆ సమావేశ ప్రాంగణంలో అరెస్టు చేసి అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తరలించి తన గొంతునొక్కారు. ఈ సందర్భంగా ప్రసాద్ నేత మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకల పైన స్పష్టమైన అవగాహన కలిగి సభ్యసమాజానికి తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత కుట్రను బహిర్గతం చేస్తారనే భయంతో కనీసం రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించకుండా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
గ్రూప్ 1 ఉద్యోగ నిర్వహణ, మూల్యాంకనం చేసిన విధానంలో జరిగిన తప్పిదాలను, దానికి సంబంధించిన ఆధారాలను నిరుద్యోగుల పక్షాన హైకోర్టుకు సమర్పించి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. తిరిగి పేపర్ కరెక్షన్ లేదా మెయిన్స్ ఎగ్జామ్ ను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని తీర్పునివ్వడం అనేది నిరుద్యోగులు వారి పక్షాన పోరాడిన ప్రతి ఒక్కరి విజయంగా ప్రసాద్ నేత తెలిపారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని న్యాయం కోసం బాధితులకు అండగా ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా గొంతుకుగా వారి సమస్యల పరిష్కారంలో ముందుండాలని పార్టీ నేతలుు కేటీఆర్ జాన్సన్ నాయక్ లు ప్రసాద్ నేతకు సూచించారు.