Friday, May 9, 2025
HomeUncategorizedఆర్థిక కష్టాలు.. అనవసర ఇష్టాలు

ఆర్థిక కష్టాలు.. అనవసర ఇష్టాలు

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆర్థిక కష్టాల గురించి ఇటీవల తరచూ ఏదో ఒక సందర్భంలో ఏకరువు పెడుతూనే ఉన్నారు. ఒకరోజు అధికారులు, ఇంకో రోజు మీడియా, మరో రోజు ఉద్యోగ సంఘాలతో తన ప్రభుత్వ ఆర్థిక నిస్సహాయతను చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితికి కేసీఆర్‌ సర్కారు చేసిన అప్పులు, అందుకు తాము కడుతున్న వడ్డీల గురించి పదే పదే మీడియా దృష్టికి తెస్తున్నారు. వాస్తవ పరిస్థితి అదే అయినా, ఇదోరకం రాజకీయ ఎత్తుగడగానే ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సాధారణమే అయినా, పరిపాలన మాత్రం జరగాల్సిందే. దానికి రొక్కం కూడా తప్పదు. అది లేకుండా తామిచ్చిన హామీలను అమలు చేయ డానికి సర్కారుకు వస్తున్న ఆదాయమెటూ సరిపోవడం లేదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం ముఖం చాటేస్తుండ టంతో ‘మమ్మల్నీ నమ్మడం లేదని’ సీఎం వాపోతున్నారు. అలాగే రాష్ట్రం అప్పులు రూ.8.15 లక్షల కోట్లపైగానే ఉన్నాయని గుర్తుచేస్తు న్నారు. కేంద్రం వైపు చూసినా నెలల తరబడి అగో, ఇగో అంటూ తాత్సారం చేయడం మినహా నిధులు విదల్చని పరిస్థితి. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు సమరానికి సన్నద్ధమవుతున్న వేళ, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల తరుణంలో రూ.కోట్ల వ్యయంతో కూడిన మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల నిర్వహణ అవసరమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ప్రభుత్వ పథకాల అమలు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు, రాష్ట్ర ఖజానాలో కాసుల గలగలలు లేకపోవడంతో అందాల పోటీల పేర కోట్లాది రూపాయలు వృథా ఎందుకనే సందేహాం సహజంగానే ఉత్పన్నమ వుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలాగూ లేదు.ఉన్న ఖజానాను సక్రమంగా ఖర్చుచేయడంలో అప్రమత్తత కనపర్చాలి కదా? ఇందుకు ఈ పోటీలతో ప్రపంచపటంలో హైదరాబాద్‌ చేరుతుందనీ, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగు తాయనీ, హైదరాబాద్‌ అభివృద్ధికి మరింత తోడ్పాటునంది స్తాయని సర్కారు చెబుతున్నది. హక్కుగా రావాల్సిన నిధులను మోడీ సర్కారు ఇవ్వడం లేదు. అలాంటి సందర్భంలో అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ, అన్నదాతలపై లేదేందుకంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుబంధు ఎలాగూ అత్తెసరే అమలైంది. చాలామంది రైతుల ఖాతాల్లోకి డబ్బు చేరలేదు. ధాన్యం కోనుగోళ్ల కోసం రూ.6200 కోట్ల మేర చెల్లించాల్సిన అవసరం ఉండగా, అందులో సగం రూ.మూడు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. గతేడాది జూన్‌లో ఇవ్వాల్సిన పీఆర్సీ సంగతి పక్కనబెడితే, ఉద్యోగుల వేతనాల బకాయిలు, రకరకాల పెండింగ్‌ బిల్లుల పేర రూ.9200 కోట్ల మేర పేరుకుపోవడం సర్కారుకు తెలిసిందే.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. కొనపోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నట్టు ప్రతినెలా రూ.6500 కోట్ల ఆదాయ లోటుతో ఉక్కిరిబిక్కిర వుతున్నది. పూడ్చుకునే మార్గాలను అన్వేషిస్తున్నా ఫలితం లేదు. బిల్లుల్లో వేటిని ఆపాలో, వేటిని ఇవ్వాలో సర్కారుకు పాలుపోవడం లేదు. ఇదిలావుంటే కేంద్ర మంత్రి బండి సంజరు రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేసినట్టు ఇటీవల నితిన్‌ గడ్కరీ పర్యటనలో సెలవిచ్చారు. నిజంగా అదే జరిగి ఉంటే, రోడ్లకు గుంతలు పూడ్చడానికి కూడా డబ్బుల్లేవని సీఎం రేవంత్‌ ఎలా అన్నారో మరి !? ఇద్దరి మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకరు నిధులు ఇస్తున్నా మంటే, మరొకరు చిప్ప చూపిస్తుండటంలోని లోగుట్టును ఇట్టే పసిగట్టవచ్చు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి ప్యాకేజీ పేరుతో రాజకీయాలు చేయడం, కాసులతో ఓట్లను కొనడం అధికార బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో కెల్లా జీఎస్టీ, ఇతరాల రూపేణా పన్నులను కేంద్రానికి అత్యధికంగా చెల్లిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. కాగా రాష్ట్రానికి మాత్రం సాధారణంగా వచ్చే నిధులను సైతం అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తగ్గించడం చేస్తున్నది. కనీసంగా దాదాపు రూ.50 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారు. అలాగే కేంద్ర సర్కారు పథకం ఫసల్‌బీమా యోజన నిధుల లేమీతో కొట్టు మిట్టాడుతున్నది. జాతీయ రహదారుల నిర్మాణ పనుల బిల్లులు నెలల తరబడి ఆలస్యం చేస్తున్నది. స్మార్ట్‌ సీటీల పేర హడావిడే తప్ప రాష్ట్రాలపై కనికరం లేనేలేదు. అంతెందుకు తాను చేపట్టిన పథకాలకూ రొక్కం కేటాయించడంలోనూ అలక్ష్యం కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్నా భోజన పథకం పీఎం పోషణ్‌ పర్యవేక్షణా లోపం, నిధుల్లేక నీరుగారిపోతున్నది. దీనికి రూ. 307 కోట్లు కావాల్సి ఉంటే, రాష్ట్ర వాటా కింద రూ.115 కోట్లు కట్టాలని తెలంగాణకు హుకుం జారీచేయడం గమనార్హం. నిధుల కోసమైనా, రాష్ట్రాల హక్కుల కోసమైన కలిసొచ్చే కేరళ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాలతో కలిసి పోరాటం చేయడమే రేవంత్‌ సర్కార్‌కు ముందున్న ఏకైకమార్గం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -