వరల్డ్ నం.6పై మెరుపు విజయం
చైనా మాస్టర్స్ సూపర్ 750
షాంఘై (చైనా) : భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది!. ఇటీవల కొరకరాని కొయ్యగా మారిన థారులాండ్ షట్లర్ పార్నపవీ చొచువాంగ్‌పై సింధు ధనాధన్ విజయం సాధించింది. చైనా మాస్టర్స్ బిడబ్ల్యూఎఫ్ సూపర్ 750 టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. 41 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో 21-15, 21-15తో పి.వి సింధు అదిరే విజయం నమోదు చేసింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-4తో నిలిచిన సింధు అదే దూకుడు కొనసాగించింది. రెండో గేమ్‌లో 13-13తో పార్నపవీ పోటీనిచ్చినా.. సింధు ఆ తర్వాత వరుస పాయింట్లతో రెచ్చిపోయింది. నేడు క్వార్టర్స్‌లో వరల్డ్ నం.1, దక్షిణ కొరియా షట్లర్ అన్సె యంగ్‌తో సింధు తలపడనుంది. సింధుపై యంగ్ 7-0తో తిరుగులేని ముఖాముఖి రికార్డు కలిగి ఉంది. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నం.7 సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సైతం క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ నం.21 చైనీస్ తైపీ షట్లర్లు చియా, వాంగ్‌లపై 21-13, 21-12తో సాత్విక్, చిరాగ్‌లు ఏకపక్ష విజయం సాధించారు. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-5తో ఆధిక్యంలో నిలిచిన సాత్విక్, చిరాగ్ అదే జోరు కొనసాగించారు. రెండో గేమ్‌లో చైనీస్ తైపీ జోడీ ప్రతిఘటించే ప్రయత్నం చేసినా.. సాత్విక్, చిరాగ్ మరింత దూకుడు చూపించారు. 16-8తో గెలుపు లాంఛనం చేసుకున్న సాత్విక్, చిరాగ్‌లు వరుస గేముల్లోనే గెలుపొందారు.