ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు
ఈనెలలోనే ఖరారయ్యే అవకాశం
చివరిదశకు టీఏఎఫ్‌ఆర్సీ కసరత్తు
22 లేదా 24న ప్రభుత్వానికి నివేదిక
హైకోర్టులో కౌంటర్‌దాఖలు చేయనున్న విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2025-26)లో పాత ఫీజులుంటాయా?, కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయా?అన్న సందిగ్ధానికి తెరపడే అవకాశమున్నది. కొత్త ఫీజులను ఖరారు చేసి వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇంజినీరింగ్ ఫీజుల ఖరారుపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కసరత్తు చివరి దశకు వచ్చింది. గురువారం టీఏఎఫ్‌ఆర్సీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 22 లేదా 24న మరోసారి సమావేశమై నివేదికను రూపొందించి ప్రభుత్వ పరిశీలనకు పంపించే అవకాశమున్నది. ఆ తర్వాత టీఏఎఫ్‌ఆర్సీ, విద్యాశాఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నాయి. అయితే ఇంజినీరింగ్ ఫీజుల పెంపునకే టీఏఎఫ్‌ఆర్సీ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త ఫీజులే అమల్లోకి వస్తాయని తెలుస్తున్నది. గత విద్యాసంవత్సరంలో ఉన్న పాత ఫీజులనే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పాత ఫీజులు కాకుండా టీఏఎఫ్‌ఆర్సీ అంగీకరించిన ఫీజులను కాలేజీలకు ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై విచారణ జరుగుతున్నది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా టీఏఎఫ్‌ఆర్సీ ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేసి అమలు చేయనుంది.
అయితే చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ), మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. టీఏఎఫ్‌ఆర్సీ ఖరారు చేసినట్టుగా సీబీఐటీకి రూ.2.23 లక్షలు, ఎంజీఐటీకి రూ.రెండు లక్షలు వసూలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గత విద్యాసంవత్సరంలో సీబీఐటీ ఫీజు రూ.1.65 లక్షలు, ఎంజీఐటీ ఫీజు రూ.1.60 లక్షలు ఉన్నది. ఆ తర్వాత మరికొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. వాటిపై విచారణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో 180 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 90,246 సీట్లుంటే 76,793 మంది చేరారు. 13,453 సీట్లు మిగిలాయి. పాత ఫీజు కట్టాలా?, వద్దా?అనే దానిపై విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉన్నది. దానిపై ఈనెలలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నది. రాష్ట్రంలో ఎప్‌సెట్‌లో పది వేలలోపు ర్యాంకుతోపాటు ఎస్సీ,ఎస్టీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదివిన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం వర్తిస్తుంది. ఆ ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంకోవైపు ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యా కాలేజీల ఫీజుల నిర్ధారణకు సంబంధించి ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి చైర్మెన్‌గా అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ పలుమార్లు సమావేశమై 2025-28 బ్లాక్ పీరియెడ్ ఫీజులకు సంబంధించి అనేక అంశాలపై చర్చించి నివేదికను సవర్పించింది. పలు సిఫారసులను చేసింది. వాటి ఆధారంగా టీఏఎఫ్‌ఆర్సీ కాలేజీలతో తిరిగి సంప్రదింపులు జరిపి ఫీజుల ఖరారుపై కసరత్తు చేస్తున్నది.
ఇంజినీరింగ్ ఫీజుల పెంపు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES