హైదరాబాద్‌లో నీటికుంటల్లా రహదారులు
వాహనదారులకు తప్పని ఇబ్బందులు
అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో రెండో రోజూ వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద బీభత్సంతో రోడ్లు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈ సమయంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సాయంత్రం విద్యార్థులు, ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, సెక్రటేరియట్, అబిడ్స్, కోఠి, హిమాయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. ఐటీ కారిడార్‌తోపాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చేందుకు అవకాశముండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు మంత్రి సూచన
నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. మూడ్రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే పడిందని, కుంభవృష్టి కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. అత్వసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్పందించాలని ఆదేశించారు. మ్యాన్‌హౌల్స్ వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే హైదరాబాద్ కలెక్టరేట్ హెల్ప్‌లైన్ నెం 9063423979కు, జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెం.040 2111 1111కు కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు అమీర్‌పేట్‌లోని గాయత్రికాలనీ, మాదాపూర్‌లోని అమర్‌సొసైటీ, బాగ్‌లింగంపల్లిలోని శ్రీరాంనగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటించారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మైత్రివనం వెనుక ఉన్న గాయత్రీనగర్‌కి ముప్పు ఉన్నట్టు గుర్తించారు. గాయత్రినగర్లోనూ నాలాలో సీల్డ్ తొలగించాలని స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. నాలాల్లో పూడిక తీసి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానికులకు ఆయన హామీ ఇచ్చారు. దుర్గం చెరువులో నీటిమట్టం తగ్గించడంతో కొంతమేర పరిసర కాలనీలకు ముంపు సమస్య తీరనున్నట్టు హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్లకుపైగా వర్షం పడటంతో ఇబ్బందులు తలెత్తాయని స్పష్టం చేశారు.
లభ్యమైన మృతదేహం
భారీ వర్షానికి అఫ్జల్‌సాగర్ డ్రైనేజీలో ఆదివారం మామ, అల్లుడు కొట్టుకుపోగా.. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. నల్లగొండలోని మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని సహాయక సిబ్బంది కనుగొన్నారు.