Friday, September 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురిసోర్స్‌పర్సన్స్‌ సమస్యలు పరిష్కరించాలి

రిసోర్స్‌పర్సన్స్‌ సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలి : తెలంగాణ మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్‌.రమ

నవతెలంగాణ – ముషీరాబాద్‌
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న రిసోర్స్‌పర్సన్స్‌ (ఆర్‌పీ) సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ లో గురువారం తెలంగాణ మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ఆర్పీలు రెండు దశాబ్దాలుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తు న్నారని తెలిపారు. మహిళలకు బ్యాంకు రుణాలు శ్రీనిధి నుంచి ఇప్పించడం, వాటిని తిరిగి సకాలంలో చెల్లించేలా చూడటం, మహిళల అభివృద్ధికి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఆర్పీలు చేస్తున్న కృషి అమోఘం అన్నారు. ఇన్ని పనులు చేస్తున్న వారికి రూ.6 వేల వేతనమే అందుతోందని, శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చాలీచాల ని వేతనాలతో కష్టంగా బతికీడుస్తున్నారన్నారు. ఆర్పీలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం ఇవ్వాలని, ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌, హెల్త్‌ కార్డులు, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్‌.రమ మాట్లాడుతూ.. మున్సిపల్‌ పట్టణాల్లో సంఘాల పుస్తక నిర్వహణకు ఎంపికైన ఆర్పీలతో అనేక రకాల పనులు చేయించుకుంటున్నారని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమం, చెత్త వేరు చేయడం, కంపోస్ట్‌ తయారీ, స్వచ్ఛ సర్వేక్షణ్‌, ఓడీఎఫ్‌ కార్యక్రమం, బతుకమ్మ చీరల పంపిణీ వంటి అన్ని కార్యక్రమాల్లో ఆర్పీలు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఇన్ని పనులు కేవలం రూ.6 వేల వేతనంతో చేస్తున్నారని, అది కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబాలు గడవలేక, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, కనీసం బీమా సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌ వేతనాలు చెల్లించి వారిని ఆదుకోవాలని, రూ.10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు బాలమణి, కార్యదర్శి మంజుల, కోశాధికారి సుభద్ర, పద్మా, లావణ్య, ఉమా వసంత, లావణ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -