ట్రంప్‌పై లూలా ఆగ్రహం
డోనాల్డ్‌తో సంబంధాలు లేవని స్పష్టీకరణ
బ్రసిలియా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా స్పష్టం చేశారు. ట్రంప్ ప్రపంచానికి చక్రవర్తి ఏమీ కాదని ఎద్దేవా చేశారు. లూలా బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ బ్రెజిల్ వస్తువులపై ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాలు ‘రాజకీయపరమైనవ’ని వ్యాఖ్యానించారు. కాఫీ, మాంసం వంటి బ్రెజిల్ ఉత్పత్తులను ఉపయోగించే అమెరికా వినియోగదారులు ఇక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరపాల్సి ఉంటుందని హెచ్చరించారు. బ్రెజిల్‌తో సంబంధాల విషయంలో ట్రంప్ పాల్పడుతున్న తప్పిదాలకు అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని చెప్పారు. ట్రంప్‌తో చర్చించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని బీబీసీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లూలా సమాధానమిస్తూ ఆయన ఎన్నడూ సంప్రదింపులను కోరుకోలేదని తెలిపారు. లూలా తనకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చునని ట్రంప్ చెబుతున్నారని, అయితే ఆయన ప్రభుత్వంలోని వారికి చర్చలు ఇష్టం లేదని అన్నారు. అమెరికా విధించిన సుంకాలను గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్నానని అంటూ టారిఫ్‌పై సామాజిక మాధ్యమంలో ప్రకటన చేసినందుకు ట్రంప్‌పై విమర్శలు కురిపించారు. సమాచారం అందించేందుకు ఇది ‘నాగరిక’ పద్ధతి కాదని ఎత్తిపొడిచారు. ట్రంప్ తన పోర్టల్‌లో వాటిని ప్రచురించారని గుర్తు చేశారు. ట్రంప్‌తో తన సంబంధాలు సరిగా లేకపోయినప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షులు, బ్రిటన్ మాజీ ప్రధానులతో పాటు ఈయూ, చైనా, ఉక్రెయిన్, వెనిజులా, ఇతర దేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయని లూలా చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన సంబంధాలను ఆయన సమర్ధించుకున్నారు. ‘నాకు ట్రంప్‌తో సంబంధాలు లేవు. ఎందుకంటే ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నేను బ్రెజిల్ అధ్యక్షుడిని కాదు. ఆయన సంబంధాలు బోల్సొనారోతోనే కానీ బ్రెజిల్‌తో కాదు’ అని లూలా తెలిపారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ఎదురుపడితే ఆయనకు అభివాదం చేస్తానని, ఎందుకంటే ఆయన నాగరిక పౌరుడని చెప్పారు. ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే అయి ఉండవచ్చు కానీ ప్రపంచానికి చక్రవర్తి కాదని అన్నారు. బోల్సొనారో, ఆయన సహ కుట్రదారులు కుట్రకు ప్రయత్నించారని, తనను హత్య చేయాలని చూశారని తెలిపారు. బోల్సెనారోను వేధింపులకు గురి చేశారంటూ ట్రంప్ చేసిన ఆరోపణను తోసిపుచ్చారు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి వీటో అధికారాన్ని ఇవ్వడాన్ని లూలా విమర్శించారు. దీనివల్ల ఘర్షణలను నివారించలేకపోతోందని, రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన దేశాలకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని చెప్పారు. కోట్లాది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్, ఆఫ్రికా దేశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. రష్యా, చైనా దేశాలతో బ్రెజిల్ భాగస్వామ్యాన్ని లూలా సమర్ధించారు. తమకు చమురు అవసరమని, అందుకే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. అంతేకానీ ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధానికి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదని స్పష్టం చేశారు. గాజాలో కొనసాగుతున్న ఘర్షణ యుద్ధం కాదని, అది మారణహోమమని లూలా తెలిపారు.