Friday, September 19, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో విద్యార్థులపై విరిగిన లాఠీ

ఏపీలో విద్యార్థులపై విరిగిన లాఠీ

- Advertisement -

ఆదోనిలో ‘ఛ‌లో మెడికల్‌ కళాశాల’ ఉద్రిక్తత
పది మందిపై కేసు నమోదు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకమిటీ ఖండన

ఆదోని : కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రయివేటీకరణ చేయరాదని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఛ‌లో మెడికల్‌ కళాశాల’ ఉద్రిక్తతకు దారితీసింది. ఆదోని మండలం ఆరేకల్‌ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాల వద్దకు సుమారు 200 మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తలను పంపినప్పుడు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు రహదారిపై బైఠాయించారు. ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, ఉపాధ్యక్షులు శ్రీనివాసులును కాళ్లతో తన్ని, పిడుగులు గుద్దుతూ పోలీసు వాహనం ఎక్కించారు. జిల్లా అధ్యక్షులు సాయి ఛాతిపై పిడిగుద్దులు గుద్దడంతో సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు విద్యార్థి నాయకులను రోడ్డుపై నుంచి ఈడ్చుకుంటూ వచ్చారు. వీరందరిని ఆదోని తాలుకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. లాఠీఛార్జీలో గాయాలపాలైన నాయకులకు కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయించకుండా పది మంది విద్యార్థులను స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు స్టేషన్‌కు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు.

కడపునొప్పితో బాధపడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యాక్షులు శ్రీనివాసును ఆస్పత్రికి తీసుకువెళ్తామని అడిగిన సిపిఎం నాయకులపై ఎస్‌ఐ రామాంజనేయులు పరుషంగా ప్రవర్తించారు. ‘ఎప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లాలో మాకు తెలుసు…ఇప్పుడు అవసరం లేదంటూ’ దురుసుగా మాట్లాడారు. శాంతియుత నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమని డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు వెంకటేష్‌ విమర్శించారు. సిపిఎం, సిఐటియు, డివైఎఫ్‌ఐ నేతలు పరామర్శించారు. రాత్రి ఎనిమిది గంటలకు విద్యార్థులను స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. పోలీసులపై దాడి చేశారని, పోలీసు వాహనం ధ్వంసం చేశారని, హైవేపై రాకపోకలకు అంత రాయం కలిగించారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి రంగప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.శాంతియుత నిరసన తెలియజేస్తున్న విద్యార్ధు లు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు దుర్భాషలాడుతూ, దాడి చేయడాన్ని భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎఫ్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్‌, కె.ప్రసన్నకుమార్‌లు తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -