అమెరికా కోత పెట్టొచ్చన్న సీఈఏ నాగేశ్వరన్
న్యూఢిల్లీ : వచ్చే రెండున్నర నెలల్లో భారత్‌పై అమెరికా సుంకాలు తగ్గొచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 8-10 నెలల్లో టారిఫ్‌ల్లో కోత ఉండొచ్చన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలును సాకుగా చూపుతూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. మళ్లీ అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ నిర్వహించిన కార్యక్రమంలో నాగేశ్వరన్ మాట్లాడుతూ.. యుఎస్ తొలుత విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలతో పాటు మరో 25 శాతం అదనపు సుంకాలను మనం ఊహించలేదన్నారు. రెండోసారి విధించిన 25 శాతం సుంకాలకు భౌగోళిక రాజకీయ పరిస్థితులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నానని చెప్పారు.
కాగా.. ఇటీవల పరిణామాలు గమనిస్తే నవంబర్ 30 తర్వాత అదనపు సుంకాల భారం ఉండకపోవచ్చన్నారు. అయితే తాను ఈ మాట చెప్పడానికి ఎలాంటి ఆధారం కూడా లేదన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. యుఎస్ ప్రతీకార సుంకాలపై రానున్న రెండు నెలల్లో మరింత స్పష్టత రావొచ్చన్నారు. ప్రస్తుతం భారత ఎగుమతుల విలువ 850 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. రానున్న రోజుల్లో 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా వేశారు. జిడిపిలో ఎగుమతుల వాటా 25 శాతంగా ఉందన్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య మంగళవారం నుంచి మళ్లీ వాణిజ్య చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని ఇరుపక్షాలు అంగీకరించాయని వాణిజ్య శాఖ పేర్కొంది.
రెండున్నర నెలల్లో సుంకాలు తగ్గొచ్చు
- Advertisement -
- Advertisement -