హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ పిటిషన్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తనపై మూడు చోట్ల పోలీసులు నమోదు చేసిన వేరువేరు కేసులను కొట్టేయాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రెండు కేసుల్లో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. మరో కేసును హైకోర్టు కొట్టేసింది.రాజకీయ కక్షలతో తనపై ఆధారాల్లేని ఫిర్యాదులతో పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని హరీశ్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు. 2024 ఆగస్టు 14లోగా రుణమాఫీ చేస్తామని సీఎం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి మోసం చేసినందున ప్రజలకు కీడు జరగరాదంటూ యాదగిరి గుట్టపై హరీశ్ పూజలు చేయించారు. దీనిపై ఈవో ఫిర్యాదు మేరకు గుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలనే కేసులో ఈవో, పోలీసులకు నోటీసులు ఇచ్చిన న్యాయమూర్తి విచారణను అక్టోబరు 8కి వాయిదా వేశారు. తనను హరీశ్‌రావు, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ ఫిర్యాదు ఆధారంగా బాచుపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టేయలంటూ దాఖలైన పిటిషన్‌లో పోలీసు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కరీంనగర్‌లో నమోదు చేసిన కేసును సవాల్ చేసిన హరీశ్ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ కేసులో ఛార్జి షీటు దాఖలు చేసినందున జోక్యానికి నిరాకరించారు.
సహకార కమిషన్ నోటీసు రద్దు
కేసుల విచారణకు హాజరుకావాలని సహకార కమిషన్ ఇచ్చిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది. ఏ కేసు విచారణ అనేది నోటీసులో పేర్కొనకపోవడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒకే రోజు నాలుగు వందలకుపైగా అప్పీళ్ల విచారణ పూర్తి చేయడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. సమాచార హక్కు కార్యకర్త వి.శ్యామ్ కమిషన్ ముందు వేసిన 404 అప్పీళ్లను ఈ నెల 18న విచారిస్తామని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. దీనిపై శ్యామ్ వేసిన అత్యవసర పిటిషన్‌ను జస్టిస్ టి.మాధవీదేవి విచారించారు. ఒకేసారి అన్ని అప్పీళ్లను ఎలా విచారిస్తారంటూ కమిషన్‌ను ప్రశ్నించారు. అన్ని కేసుల్లో ఒకేసారి వాదనలు చెప్పడం కూడా కష్టమన్నారు. నోటీసులో కేసు వివరాలు లేకపోవడంతో వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 11న ఇచ్చిన నోటీసును రద్దు చేస్తున్నామని తీర్పు చెప్పారు. కేసుల వివరాలతో నోటీసు జారీ చేయాలని సమాచార కమిషన్‌ను ఆదేశించారు.
హైకోర్టుకు హాజరైన జీఎస్టీ అధికారులు
ఆన్‌లైన్ ద్వారా జీఎస్టీకి సంబంధించిన నోటీసులు జారీ చేసిన తీరును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జీఎస్టీ సాఫ్ట్‌వేర్ పనితీరు ఎలా ఉంటుందో అధికారులు కంప్యూటర్ ద్వారా వివరించారు. కంప్యూటర్ ద్వారా నోటీసుల జారీ ప్రక్రియను ప్రత్యక్షంగా తెలియజేశారు. చీఫ్ జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్ డివిజన్ బెంచ్ వద్ద జీఎస్టీకి సంబంధించిన కేసులు 170 వరకు గురువారం విచారణకు వచ్చాయి. అధికారుల వివరణను జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావు కూడా పరిశీలన చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత, కేంద్ర జీఎస్టీ కమిషనర్ శ్రీనివాస్ విచారణకు హాజరై డిజిటల్ నోటీసుల జారీ తీరును కంప్యూటర్ ద్వారా వివరించారు. లడిజిటల్ కీతో సంతకంతో ఉన్న నోటీసును డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు సంతకం ఉండదనీ, అంతమాత్రాన సంతకం లేని నోటీసుగా పరిగణించకూడదని చెప్పారు. వారి వివరణ అనంతరం డివిజన్‌బెంచ్ నాలుగు వారాల్లోగా రాష్ట్ర జీఎస్టీ అధికారులు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఆపై రెండు వారాల్లోగా పిటిషనర్లు తమ అభ్యంతరాలతో రిప్లరు కౌంటర్లు వేయాలని సూచించింది. కొత్త నిబంధనలపై అందరూ అధ్యయనం చేయాలని సూచించింది. ఆ తర్వాత వాయిదాలు వేయబోమని చెప్పింది. భారీగా కేసులు ఉన్నందున కొన్నింటిలో కౌంటర్లు వేయకపోతే, ఇతర కేసుల్లోని కౌంటర్ అంశాల ఆధారంగా అన్ని కేసులను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు హైకోర్టు అనుమతిచ్చి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
కేసులు కొట్టేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES