Friday, May 9, 2025
Homeప్రధాన వార్తలువిద్యా వైద్యానికి పెద్దపీట

విద్యా వైద్యానికి పెద్దపీట

- Advertisement -

– మానవ వనరుల అభివృద్ధికి చర్యలు
– వైద్యంపై ఏటా రూ.11,482 కోట్లు ఖర్చు
– రూ.11,600 కోట్లతో సమీకృత గురుకులాలు
– రూ.450 కోట్లతో 90 ట్రామా సెంటర్లు
– గత ప్రభుత్వం కంటే మిన్నగా విద్యావైద్యంపై వ్యయం
– రూ.130కోట్లతో రఘునాథపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన : పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు రాజనర్సింహ, తుమ్మల, పొంగులేటి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

మానవ వనరుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దానిలో భాగంగానే విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు సంవత్సరానికి సరాసరి వైద్యంపై రూ.5,959 కోట్లు ఖర్చు చేస్తే.. 2024- 25 ఏడాది కాలంలోనే ప్రజా ప్రభుత్వం రూ.11,482 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8 కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కంటే అధికంగా ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచడం వల్ల 90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యంతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్స్‌ చార్జీలు 200 శాతం పెంచినట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 58 యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలను మొదటి దఫా మంజూరు చేసి రూ.11,600 కోట్లతో నిర్మాణాలు చేపట్టామన్నారు. మెడికల్‌ కాలేజీకి అనుసంధానంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమి, నిధుల సేకరణలో జిల్లా మంత్రులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తున్నామని, రు.100 కోట్ల ఖర్చుతో రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ నిర్మించి నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ చేశామన్నారు. గిరిజన కుటుంబాలకు రూ.12,500 కోట్లతో ఇందిరా గిరిజన వికాసం పథకం కింద ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలకు సోలార్‌ పంప్‌ సెట్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌, స్ప్రింకర్లను అందిస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, దుబారా ఖర్చులు చేయకుండా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని, ఉద్యోగస్తుల అవసరాలను కూడా ప్రభుత్వం భవిష్యత్తులో తీరుస్తుందని చెప్పారు.
రూ.4,100 కోట్లతో రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌: మంత్రి రాజనర్సింహ
రూ.4,100 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి రూ.37 కోట్లతో రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ వరంగల్‌కు, ఆర్బన్‌ రిట్రివల్‌ సెంటర్‌ ఖమ్మం జిల్లాకు మంజూరు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేశామన్నారు. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ ప్రజలు హైదరాబాద్‌పై ఆధారపడకుండా సూపర్‌ స్పెషాలిటీ సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్‌సీడీ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాకు మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ సమకూర్చుతున్నామని అన్నారు. ఖమ్మంలో వ్యాస్కులర్‌ యాక్సిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టైమ్‌ను 18 నుంచి 14 నిమిషాలకు తగ్గించేందుకు నూతనంగా 213 అంబు లెన్స్‌లు ప్రారంభించామని, దీన్ని 11 నిమి షాలకు తగ్గించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఏజెన్సీ మండలాల్లో 2 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిడ్‌ వైఫరీ కోర్సులు అందించేందుకు కృషి చేస్తామని, వీటి ద్వారా సీ సెక్షన్‌ డెలీవరీలు తగ్గుతాయని అన్నారు. రాష్ట్రంలో జాతీయ, స్టేట్‌ రహదారులపై సుమారు 90 ట్రామా సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నామని, బ్లాక్‌ స్పాట్‌ వద్ద ప్రతి 35 కి.మీకు ఒక ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం వచ్చాక వైద్యశాఖలో సుమారు 8 వేల పోస్టులు భర్తీ చేశామని అన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా విద్యావైద్యానికి లోటు లేకుండా..: మంత్రి పొంగులేటి
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా విద్యా వైద్యానికి లోటు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలు రూ.1000 కోట్లు చెల్లిస్తూ వైద్య శాఖలో నూతన ఆస్పత్రులు, వైద్య, నర్సింగ్‌ కళాశాలలు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్‌నాయక్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ రాయల నాగేశ్వర రావు, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డా.నరేంద్ర కుమార్‌, టీజీ ఎంఐడీసీ ఎండీ ఫణిందర్‌ రెడ్డి, ఖమ్మం నగర మేయర్‌ నీరజ, డీసీసీబీ చైర్మెన్‌ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, జెడ్పీ సీఈవో దీక్షా రైనా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డా.రాజేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.కళావతి బాయి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం: మంత్రి తుమ్మల
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలు కూడా మంజూరు అవుతున్నాయని, ఖమ్మం జిల్లాకు కూడా ఆ రకంగా మంజూరు చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రి మరింత విస్తరించాలని, అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి-నాగపూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పక్కన వైద్య కళాశాల వస్తుందని, సంవత్సర కాలంలో దీని నిర్మాణ పనులు పూర్తిచేసి తరగతులు ఇక్కడి నుంచి కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -