నవతెలంగాణ-హైదరాబాద్: బాంబే హైకోర్టు కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టును బాంబులతో పేల్చేస్తామని శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనంగా పోలీస్ బలగాలను రప్పించి ముందుజాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.కోర్టు లోపలికి వచ్చే వాహనాలను, కోర్టు బయటికి వెళ్లే వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తనీఖీల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ మెయిల్‌తో కోర్టు కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగలేదు.
కాగా బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఈ వారం రోజుల్లో ఇది రెండోసారి. గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 12న కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో లాయర్లను, సిబ్బందిని హుటాహుటిన బయటికి పంపించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి బాంబుల ఆనవాళ్లు దొరకలేదు.