Friday, May 9, 2025
Homeఅంతర్జాతీయంవారి త్యాగాలను మరవలేం

వారి త్యాగాలను మరవలేం

- Advertisement -

– విక్టరీ డే పరేడ్‌ కోసం విచ్చేసిన చైనా నేత జిన్‌పింగ్‌తో పుతిన్‌ చర్చలు
మాస్కో:
నయా నాజీవాదం, సైనికవాదానికి వ్యతిరేకంగా రష్యా, చైనాలు నిలిచాయని, రెండో ప్రపంచ యుద్ధంలో అశువులు బాసిన అనేకమంది ప్రజల త్యాగాలను తమ రెండు దేశాలు ఎన్నటికీ మర్చిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. విక్టరీ డే పరేడ్‌ కోసం మాస్కో విచ్చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో గురువారం పుతిన్‌ చర్చలు జరిపారు. స్వేచ్ఛ, స్వాతంత్యాల కోసం జరిగిన ఈ యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ 2.70కోట్ల మందిని పోగొట్టుకుందని, చైనా 3.70కోట్ల మందిని కోల్పోయిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వాన ఈ విజయం సాధించామని చెప్పారు. ఫాసిజంపై సాధించిన విజయం ప్రాధాన్యతను ఈ సందర్భంగా పుతిన్‌ నొక్కి చెప్పారు. చారిత్రక వాస్తవాలను రష్యా, చైనాలు సమర్ధిస్తాయని, నయా నాజీవాదానికి, సైనికీకరణ యొక్క ప్రస్తుత వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా పోరాడతాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న చారిత్రక జ్ఞాపకాలను జిన్‌పింగ్‌ పంచుకున్నారు. వ్యూహాత్మక పొత్తు గురించి నొక్కి చెప్పారు. భారీ మూల్యాలు చెల్లించి, చైనా, రష్యా ప్రజలు ఈ మహత్తరమైన విజయాన్ని సాధించారని వ్యాఖ్యానించారు. తద్వారా ప్రపంచ శాంతికి, మానవాళి ప్రగతికి చారిత్రక సేవలందించారని కొనియాడారు.
సైమన్‌ బొలీవర్‌కు వెనిజులా, క్యూబా నేతల నివాళి
మాస్కోలో విముక్తి నేత సైమన్‌ బొలీవర్‌కు వెనిజులా, క్యూబా అధ్యక్షులు నికొలస్‌ మదురో, మిగ్వెల్‌ డియాన్‌ కానెల్‌ ఘనంగా నివాళి అర్పించారు. నాజీ జర్మనీపై రష్యా సైన్యం సాధించిన విజయం 80వ వార్షికోత్సవ వేడుకలకు వారు మాస్కోకు వచ్చారు. విజయోత్సవ వేడుకల సందర్భంగా సైమన్‌ బొలీవర్‌ విగ్రహం వద్ద వెనిజులా విద్యార్ధులు మదురో, డియాజ్‌ కానెల్‌లకు స్వాగతం పలికారు. బుధవారం ఈ ఇరువురు నేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. రష్యాతో సహకార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై వారు చర్చలు జరిపారు. మంగళవారం రాత్రి మాస్కో వచ్చిన మదురో విమానాశ్రయం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా నాజీ ఫాసిజం, సామ్రాజ్యవాదంపై తమ ప్రజలు పోరాడుతునే వున్నారని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -